రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా
-సికాస కార్యదర్శి ప్రభాత్ చేసిన ఆరోపణల్లో నిజం లేదు
-దళిత బిడ్డగా, ప్రజల మనిషిగా సేవ చేస్తున్న
-ప్రజలారా మీరైనా ఆలోచించండి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
సికాస కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజమైనా తాను పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. తన పేరిట మావోయిస్టు పార్టీ లేఖ జారీ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంఘాల ప్రతినిధిగా, విప్లవ పార్టీలో కార్యదర్శి హోదాలో ఉన్న ప్రభాత్ నిజానిజాలు తెలుసుకుని ప్రకటన చేయాలని ఈ సందర్భంగా కోరారు. నేనంటే గిట్టని వాళ్లు చెప్పిన విషయాలు నమ్మి ఆరోపణలు చేయడం నా మనసును బాధ కలిగించిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజాసంఘాలు, ప్రజల కష్టాలు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన బిడ్డగా ప్రజల పక్షాన ఉండి పని చేస్తున్నానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెల్లడించారు.
బెల్లంపల్లి పట్టణంలో ఇండ్లు కూలగొట్టిన విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మైనార్టీ నాయకుడు కూలీలతో గుడిసెలు వేయించి వాటిని అమ్ముకుంటున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. వాటిని మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు వెళ్లి కూలగొట్టారని స్పష్టం చేశారు. అది తెలిసిన వెంటనే తాను స్వయంగా అధికారులతో మాట్లాడానని చెప్పారు. పేదవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు చెప్పానని ఎమ్మెల్యే వెల్లడించారు. బాధితులను తిరిగి ఇల్లు కట్టుకోమని చెప్పానని అన్నారు. కానీ కొంతమంది అక్కడున్న భూమిని కబ్జా చేస్తున్న విషయం మావోయిస్టు పార్టీ తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో మీరు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నా పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నా, ఏదైనా తప్పు చేసినా సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక అన్ని పార్టీలు ఒకటై దాడులు చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చిన ఈ లేఖ విప్లవ పార్టీలతో కూడా బెదిరించే చర్యగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.