నిరుద్యోగులు నక్సలిజం వైపు వెళ్ళే ప్రమాదం ఉంది
-నేను ముందు నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదు
-ముంజ హరీష్ మృతికి ఎమ్మెల్యే, మంత్రి కారణం
-ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు ఆగ్రహం

Former RTC chairman Gone Prakash Rao is angry with the minister and MLA: రామగుండం ఎరువుల కర్మాగారం(RFCL) ఉద్యోగాల గోల్‌మాల్ వ్యవహారం మావోయిస్టుల వరకు చేరిందని… బాధితులు వారికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల కిందటే ఎరువుల కర్మాగారం లో ఉద్యోగాల గోల్ మాల్ గురించి తాను హెచ్చరించినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. బాధితులకు అప్పుడే న్యాయం చేస్తే ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఉద్యోగాల కుంభకోణంలో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీష్ కుటుంబానికి 30 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ కార్యక్రమం ఉన్నందున ఎమ్మెల్యే చందర్ కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. ఈ ఉద్యోగాల దందా విషయంలో పోలీస్ వ్యవస్థ సుమోటోగా బాధితుల పక్షాన కేసులు నమోదు చేయాలని సూచించారు. ఆర్ఎఫ్ సిఎల్ బాధితులకు వెంటనే న్యాయం చేయలని లేకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత మంత్రి, ఎమ్మెల్యే చందర్ వహించాలన్నారు. డబ్బులు తిరిగి చెల్లించకపోతే రామగుండం రణరంగంగా మారే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.