కార్మికుల పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించరా..?
-గంగానగర్ మిలినియన్ క్వార్టర్స్ విద్యార్థుల తల్లులు ఆందోళన
-వారి ఆందోళన కు సంఘీభావం తెలిపిన ఏఐటియుసి
Concern of workers and their wives to provide bus facility to their children: ‘కార్మికుల కోసం కోట్లు చేస్తున్నామని చెబుతున్నారు… కనీసం మా పిల్లలకు బస్సు సౌకర్యం కూడా సరిగ్గా కల్పించడం లేదు. ఇదేనా సంక్షేమం’… అని సింగరేణి కార్మికుల పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించారు. గంగానగర్ మిలినియన్ క్వార్టర్స్ కాలనీ లో స్కూల్ బస్ ముందు విద్యార్థుల తల్లులు ఆందోళన నిర్వహించి బస్ ను ఆపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు మాట్లాడుతూ మా భర్త సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా లో పని చేస్తున్నారని, గోదావరిఖని లో కంపెనీ క్వార్టర్లలో నివాసం ఉంటున్నామని తెలిపారు. మా పిల్లలు ఎన్.టి.పి.సి లో చదువుకుంటున్నారని, వీరికి ఆర్జీ వన్ యాజమాన్యం బస్ పాస్ లు ఇవ్వటం లేదని ఆరోపించారు. బస్ పాస్ లు ఎన్నోసార్లు ఇవ్వాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పాస్ లు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ లు లేకపోతే బస్ డ్రైవర్ మా పిల్లలను బస్సు ఎక్కించుకోవడం లేదని వారు పేర్కొన్నారు.
మాకు సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాకు పోస్టింగ్ ఇచ్చి, గోదావరిఖనిలో క్వార్టర్స్ ఇచ్చారని, మీది శ్రీరాంపూర్ ఏరియా అని చెప్పి బస్ పాస్ లు ఆర్జీ వన్ యాజమాన్యం ఇవ్వటం లేదని వారు ఆరోపించారు. సింగరేణి లో ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని మా పిల్లలు చదువుతున్న స్కూల్ కు బస్ సౌకర్యం ఎందుకు కల్పించరని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి సాధించి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకువస్తే వాటిని సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా, మెడికల్ కాలేజీ కి, భద్రాచలం వరదలకు కోట్లాది రూపాయలు సహాయం చేశారని అన్నారు. కానీ మా పిల్లలు చదువుతున్న స్కూల్ లో రవాణా సౌకర్యం కల్పించడానికి స్కూల్ బస్ లను ఎందుకు ఏర్పాటు చేయరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా పిల్లలు చదువుతున్న స్కూల్ కు బస్ సౌకర్యం కల్పించాలని వారు యాజమాన్యాన్ని కోరారు.
వారికి సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ..
గంగానగర్ లో స్కూల్ బస్ ముందు విద్యార్థుల తల్లుల ఆందోళనకు ఏఐటీయూసీ నేతలు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.వెంకట్ రెడ్డి లు వారి ఆందోళన కు సంఘీభావం తెలిపి, సింగరేణి యాజమాన్యం వారి పిల్లలకు బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.