ఇష్టమైనట్టు మాట్లాడితే బడితే పూజనే…
-ఒక్క బాధితునికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాం
-దళారులను వదిలిపెట్టి మాపై ఆరోపణలు సరికాదు
-రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Ramagundam MLA Korukanti Chander is angry with the opposition: ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడితే బడితే పూజ తప్పదని పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల సంబంధించిన విషయంలో మోసపోయిన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని అన్నారు. ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తే… చూస్తూ ఊరుకోమని చెప్పారు. ఉద్యోగాల విషయంలో లక్షలాది రూపాయలు ఇచ్చి మోసపోయిన బాధితులకు చివరి వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దళారులను నమ్మి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు.
రామగుండంలో రాజకీయ కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ఆ రోపించారు. అధికార పార్టీని కావాలనే ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నాయని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. దళారులను వదిలి పెట్టి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పై, తనపై ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఒక్క బాధితునికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన దళారులు ఏ పార్టీవారైనా, మిత్రులైనా, బంధువులైనా వదిలేది లేదన్నారు. వారి డబ్బులు వెంటనే చెల్లించాలని లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.