కనబడుట లేదు..
నియోజకవర్గం ముఖం చూడని ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత
ఆయనో యువనేత.. ఎన్నికల్లో గెలిచి తమ సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే ఆయన కనీసం నియోజకవర్గంలో పర్యటించడం లేదని పలువురు విమర్శస్తున్నారు.
బోర్లకుంట వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం ముఖం చూడటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆయన గెలిచిన నుంచి ఇప్పటి వరకు పర్యటించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒకవేళ వచ్చినా సభలు, సమావేశాలు తప్ప ప్రజలను పెద్దగా కలవరనే చర్చ సాగుతోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నా వాటిని ఆయన కనీసం పట్టించుకోవడం లేదు. ఆయనను ఎందుకు గెలిపించాం రా..? భగవంతుడా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
వెంకటేశ్ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019, మార్చి 21న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2019 సెప్టెంబరు 13 నుండి 2020 సెప్టెంబరు 12 వరకు విదేశీ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2020 సెప్టెంబరు 13 నుండి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
వెంకటేష్ నేత తన రాజకీయ గురువుగా బాల్క సుమన్‌ను భావిస్తుంటారు. వేదికలపై సైతం అదే విషయాన్ని ఆయన చేసే అభివృద్ధిని గుర్తు చేస్తుంటారు. యువనేతగా ఆయన చేసిన పనులు ఏకరువు పెడతారు. ఒకరకంగా ఆయన టీఆర్ ఎస్ లోకి రావడానికి కారణం కూడా బాల్క సుమన్ అని చెబుతారు. వెంకటేష్ నేత మాత్రం ఆయన గురువు బాటలో నడవటం లేదు. బాల్క సుమన్ ఎంపీగా ఉన్న సమయంలో గూడెం గ్రామాన్ని దత్తత తీసుకుని పలు సమస్యలు పరిష్కరించారు. ఎంపీ లాడ్స్ నిధులతో పాలు రైల్వే సమస్యలు పరిష్కరించారు. ఈయన కూడా అదే బాటలో నడిస్తే పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పలువురు చెబుతున్నారు.
ఆయన కనిపించడం లేదని బారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఎంపీని వెతికిపెట్టాలని నిరసన కార్యక్రమం సైతం చేపట్టారు. ఎంపీ వెంకటేష్ నేత ఇప్పటికైనా నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా రైల్వే సమస్యలకు సంబంధించి ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన వివేక్ వెంకటస్వామి సైతం అందుబాటులో ఉండటం లేదని ఓడించారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే వెంకటేష్ నేత అందుబాటులో ఉండాలని పలువురు కోరుతున్నారు.