తెలంగాణలో ఆ ఆపరేషన్ల నిలిపివేత
-కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలివేయాలని సర్కార్ నిర్ణయం
-ఇక నుంచి రోజుకు 15 మాత్రమే చేసేలా కొత్త నిబంధన
Suspension of operations in Telangana: ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆపరేషన్ల విషయంలో సైతం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇక నుంచి రోజుకు 15 మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా నిబంధన తీసుకొచ్చింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లలో మార్పులు చేసింది. రోజుకు 15 మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది.
ఇబ్రహీంపట్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆపరేషన్ చేసిన సర్జన్ లైసెన్సును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నలుగురికి విరేచనాలు, వాంతులు వంటి గ్యాస్ట్రో సంబంధ సమస్యలు తలెత్తాయని, సమీప దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతుండగా మరణించినట్లు డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల నగదు, డబుల్ బెడ్‌రూం ఇస్తామని హామీ ఇచ్చారని, వారి పిల్లల చదువు బాధ్యతను సైతం ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చెప్పారు.