విద్యార్థిని మృతి.. ముగ్గురి సస్పెన్షన్
-విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
-అడిషనల్ కలెక్టర్ రాజేశం వెల్లడి

Student’s death.. Suspension of three: కాగజ్‌నగర్ కస్తూర్బా విద్యాలయంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని నాగోసే ఐశ్వర్య మృతి సంఘటనలో కస్తూర్బ విద్యాలయం ఎస్ఓ స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీలో ఉన్న టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తూ అదనపు కలెక్టర్ రాజేశం వెల్లడించారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం కోసం తక్షణ సహాయం కింద 50,000 బాధిత కుటుంబానికి అందించారు. నష్టపరిహారం కింద ఆ కుటుంబానికి రూ. 15 లక్షలు వచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు.
పెద్ద ఎత్తున ఆందోళన..
అంతకుముందు కాగజ్‌నగర్ కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద ఉద్రిక్తత కొనసాగింది. విద్యార్ధిని ఐశ్వర్య మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. హాస్టల్ ఆఫీసు రూమ్‌లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆందోళనకారులు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బాధిత కుటుంబం వెల్లడించింది. విద్యార్థినికి మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కస్తూర్బా పాఠశాలలో మంగళవారం రాత్రి భోజనం చేసిన ఐశ్వర్య అనే విద్యార్ధిని నోటి నుంచి నురగ రావడంతో పాఠశాల సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బాలిక మరణించింది. అంకుశాపూర్‌కు చెందిన ఐశ్వర్య ఇక్కడ 8వ తరగతి చదువుతోంది. రెండు రోజులుగా తనకు జ్వరం వస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.