మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
Earlier Palvai Sravanti was a Congress candidate: అందరిలోనూ ఆసక్తి రేపుతున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఇక్కడ అభ్యర్థిగా మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయికి టిక్కెట్ ఇస్టున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమెను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకున్నారు. కోమటిరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఈ పరిణామమే సర్వేలో పాల్వాయి స్రవంతికి కలిసివచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ సోషల్ మీడియా సర్వేలో కూడా ఆమె టాప్ ప్లేసులో నిలబడ్డారు. పాల్వాయి స్రవంతితో పాటు చల్లా కృష్ణారెడ్డి పేరు కూడా సర్వేలో గట్టిగానే వినిపించినా అధిష్టానం స్రవంతి వైపే మొగ్గు చూపింది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటం, నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు కావడం, మహిళ నాయకురాలు కావడంతో పాల్వాయి స్రవంతిని ఫైనల్ చేసినట్లు సమాచారం.
కొద్ది రోజుల కిందటి వరకు తనకు మునుగోడు ఎన్నికలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అభ్యర్ధి ఎంపిక విషయంలో తలదూర్చడం, ప్రచారం కూడా చేస్తానని చెప్పడం కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లని కాకుండా సీనియర్‌లకు ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపారు. అంతేకాకుండా, పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా నిలబెడితే తాను కూడా ప్రచారం చేస్తానని సన్నిహిత వర్గాలతో కోమటిరెడ్డి చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే స్రవంతి ఎంపిక ఖాయమైంది. మరోవైపు గతంలో హుజురాబాద్ ఎన్నికల్లో చేసినట్లుగా చివరి నిమిషంలో అభ్యర్ధిని ఎంపిక చేసి చేతులు కాల్చుకోకుండా కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్ధిని ఖరారు చేసి ప్రచారం మొదలుపెట్టాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే స్రవంతి ఎంపిక చేసినట్లు నేతలు చెబుతున్నారు.