జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాల విడుదల
-సింగరేణి వెబ్ సైట్ లో అభ్యర్థుల మెరిట్ జాబితా
-పరీక్ష జరిగిన వారం రోజుల్లో నే ఫలితాల వెల్లడి
-మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు

Singareni Junior Assistant Exam Results Released: సింగరేణి లో 177 జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ హెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్(పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ ఈ రోజు రాత్రి 8 గంటలకు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను www.scclmines.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షను తెలంగాణలోని 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 98,882 మంది అభ్యర్థులకు 77898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఈసారి నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించారు. 49,328 మంది అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించారని, 28570 మంది పరీక్షలో క్వాలిఫై కాలేదని వెల్లడించారు.
ఆన్లైన్ లో వచ్చిన సూచనలను సంబంధిత సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ కు పంపించినట్లు వెల్లడించారు. వీటిని జేఎన్ టీయూ హెచ్ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలించిన ఆనంతరం మూడు ప్రశ్నలకు సంబంధించి సరైన సమాధానం నాలుగు అప్షన్లలో లేదన్న విషయాన్ని రూడీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రశ్నలకు అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించామన్నారు.
ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకటికి రెండుసార్లు ఓఎంఆర్ షీట్ల ను అత్యంత పకడ్బందీగా చెక్ చేసుకున్న అనంతరం రాత పరీక్ష లో మెరిట్ సాధించిన వారి వివరాలను విడుదల చేసినట్లు వివరించారు.
సింగరేణి రాత పరీక్షకు సంబంధించి అర్హత సాధించిన వారి రిజర్వేషన్, స్థానికత, మార్కులు తదితర అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను కంపెనీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ (పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను తనిఖీ చేసిన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.