ప్రెస్ క్లబ్ కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి
-జిల్లా అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
-ధ్వజమెత్తిన జర్నలిస్టు సంఘాల నేతలు
-రెబ్బనలో పెద్ద ఎత్తున రాస్తారోకో
Journalist associations are worried after the press club was demolished: రెబ్బెన ప్రెస్ క్లబ్ కూల్చిన దుండగులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకో లేదని, వారిని వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలో రహదారిపై జర్నలిస్టులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా కన్వీనర్ రవి నాయక్ , టీయూడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కూల్చిన దుండగులను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనక ఆంత్యరం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా అధికారులు, పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రెస్ క్లబ్ కూల్చిన దుండగులు ఎంతటి వారైనా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ జిల్లా ఎస్పీ రావాలని పట్టు పట్టారు. సంఘటన స్థలానికి సీఐ నరేందర్ , ఎస్సై భూమేష్ చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. మూడు రోజుల్లో ప్రెస్ క్లబ్ కూల్చిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని సిఐ నరేందర్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. మూడు రోజుల్లో అరెస్టు చేయకపోతే తిరిగి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని జర్నలిస్టు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. సంపత్ కుమార్, టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, రాజశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నీలి సతీష్, జర్నలిస్టు సంఘాల నాయకులు సురేష్ చారి , కృష్ణ మోహన్ గౌడ్, రాందాస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.