వాగులో నిలబడి గ్రామస్తుల నిరసన
-మళ్లీ ఆందోళన బాట పట్టిన దిందా గ్రామస్తులు
-హామీ ఇచ్చి అమలు చేయడం మరిచారని ఆగ్రహం
-ఈసారి స్పష్టమైన హామీ కావాలని ప్రజల డిమాండ్
-కలెక్టర్ వచ్చే వరకు దీక్ష విరమించమని వెల్లడి
The villagers of Dinda are again worried: వానాకాలం వస్తే చాలు ఊరు దాటలేరు. బయటకు వెళ్లాలంటే భయమే. ఇదీ కొమురం భీమ్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామస్తుల పరిస్థితి. తమకు బ్రిడ్జి కావాలని ఏడాది కిందట గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులు మూడు నెలల్లో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. గత ఏడాది తాము వాగు వద్ద వారం రోజులు వంతెన నిర్మాణం కోసం దీక్ష చేపట్టామని, ఎంపీడీవో, ఏఈ వచ్చి డిసెంబరు కల్లా పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని తెలపడంతో దీక్ష విరమించామని గ్రామస్తులు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు వచ్చినా.. పనులు పూర్తయ్యేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో దిందా గ్రామస్తులు మంగళవారం మరోసారి ఆందోళన బాటపట్టారు. బ్రిడ్జి నిర్మాణ స్థలం వద్ద గుడిసె వేసి నిరస దీక్ష ప్రారంభించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఊరికి ఓ వైపు వాగు.. మరో వైపు ప్రాణహిత నది ప్రవహిస్తోందన్నారు. చిన్న వర్షం పడితే చాలు వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోతాయని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. బ్రిడ్జి మంజూరైనా అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చేంత వరకు శాంతి యుతంగా దీక్ష చేపడతామని అన్నారు.