నిరుద్యోగి ఆత్మహత్య
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బబ్బెరుచెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి లోనయ్యారు. ఇక ఉద్యోగం రాదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్కు లేఖ రాశాడు. విషయం తెలుసుకున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బందిని అక్కడికే పిలిచి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకుని ఆస్పత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి మొత్తం పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం డ్యామేజీ అవుతుందన్న ఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.