తెప్ప‌ల‌తో తిప్ప‌లు..

-కుంగిపోయిన అందవెల్లి పెద్దవాగు వంతెన
-42 గ్రామాల ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు

People rafting near Andevelli Bridge :కొమురం భీం జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై వంతెన కుంగిపోయింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్ర‌జ‌లు దిక్కుతోచ‌ని స్థితిలో తెప్ప‌ల‌పై ప్ర‌యాణం సాగిస్తున్నారు. ప్ర‌మాదం అని తెలిసినా త‌ప్ప‌డం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ నుంచి దహెగాం వెళ్లే మార్గంలో అందవెళ్లి సమీపంలోని వంతెన గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కుంగి పోయింది. కొద్ది రోజుల కింద‌ట మ‌రింత‌గా కుంగింది. దీంతో వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. పలు గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దాదాపు 42 గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ప్రతిరోజు వివిధ పనులపై కాగజ్‌న‌గ‌ర్‌ పట్టణానికి వచ్చే ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కాగజ్ నగర్ నుండి దహెగాం మండల కేంద్రానికి వెళ్లాలంటే రెండు ఆటోలు మార్చాల్సి వ‌స్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఆటోను ఎంగేజ్ చేసుకుంటే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో వారికి ఆర్థికంగా ఎంతో భారం పడుతోంది. ఇక వైద్య సేవలు లేని మారుమూల గ్రామ ప్రజలు మరో మార్గంలో వెళ్లాలంటే 80 కిలోమీటర్ల‌ దూరం ప్రయాణించవలసి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలోనే అందెల్లి వంతెన ప్రాంతంలో కొంద‌రు తెప్ప‌ల ద్వారా ప్ర‌జ‌ల‌ను దాటి అవ‌త‌లి గ‌ట్టుకు దాటిస్తున్నారు. ఇటు కాగ‌జ్‌న‌గ‌ర్ వైపు, అటు ద‌హెగాం వైపు వెళ్లే ప్ర‌యాణికులు తెప్ప‌ల ద్వారానే వెళ్తున్నారు. ప్ర‌మాదం అని తెలిసినా త‌ప్ప‌డం లేద‌ని పలువురు ప్ర‌యాణికులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ వంతెన పూర్తైతే త‌ప్ప త‌మ క‌ష్టాలు తీర‌వని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఆ వంతెన ఇప్ప‌ట‌ల్లో పూర్తయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని స్థానికులు చెబుతున్నారు.

అస‌లు అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఈ బ్రిడ్జి వంగిపోయింద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డ ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్ర‌మ ర‌వాణా సాగింది. ఇసుక దొంగలు వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమరవాణా చేశారు. అధికారుల దృష్టికి ఈ విష‌యం వెళ్లినా ప‌ట్టించుకోలేదు. ఈ వ్య‌వ‌హారంలో కొంద‌రు అధికారులు కావాల‌నే చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని ప‌లువురు దుయ్య‌బ‌డుతున్నారు. అలా ఇష్టారీతిన ఇసుక త‌ర‌లింపు నేప‌థ్యంలో పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like