తొమ్మిదేళ్లకు తీరిన కల.. కేసీఆర్ చేతుల మీదుగా నామకరణం..
The dream of nine years has come true.. Naming at the hands of KCR: తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సీఎం శ్రీ కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013 లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి సీఎం శ్రీ కేసీఆర్ తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ శ్రీ మధుసూధనాచారి తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్ కు తోడ్కొని వచ్చారు.
విషయం తెలసుకున్న సీఎం శ్రీ కేసీఆర్ దంపతులు, సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు ‘మహతి’ అని నామకరణం చేసారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు.
తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, వూహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.