క్రికెట్ టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. తొక్కిసలాట, లాఠీచార్జ్
Fans clamoring for cricket tickets.. stampede, baton charge: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఎగబడటంతో జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు అభిమానులు, పోలీసులకు గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. టికెట్ల కోసం పెద్దఎత్తున క్రికెట్ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో అభిమానులను పోలీసులు నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 20మంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయినట్లు వస్తోన్న వార్తలపై అడిషనల్ కమిషనర్ చౌహన్ స్పందించారు. మహిళ చనిపోలేదని, యశోదలో చికిత్స పొందుతోందని తెలిపారు.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని ప్రభుత్వం హెచ్సీఏను ఆదేశించింది. క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయంపై సమాచారంతో రావాలని ఆదేశించింది. తెలంగాణ స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపుపై వివరణ ఇవ్వాలని హెచ్సీఏను ఆదేశించారు. మ్యాచ్ టికెట్ల వివరాలతో రావాలని హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ సహ రావాలని ఆదేశించారు. టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదన్నారు.