నువ్వు బయటకు పో… మా ఇష్టం వచ్చినోళ్లకు ఇచ్చుకుంటం
-బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు.. వాళ్ల దగ్గరే తెచ్చుకోండి
-వాళ్లను బయటకు పంపించేయండి
-నర్సాపూర్ - జిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం

Minister Indrakaran Reddy expressed anger against women: ‘మా ఇష్టం వచ్చినోళ్లకు ఇచ్చుకుంటం.. నువ్వు బయటకు పో.. ఇచ్చింది ఎక్కువ అయితే గట్లనే ఉంటంది..బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి’ ఇదీ ఓ మహిళపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు.
బతుకమ్మ చీరల పంపిణీకి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ – జి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దళితబంధు గురించి మాట్లాడారు. ఆయన ప్రసంగానికి దళిత మహిళలు అడ్డుపడ్డారు. దళితబంధుకు తాము అర్హులమైనా తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రికి కోపం వచ్చి తమకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తాం అంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు వచ్చే వరకు ఓపిక పట్టాలని.. లేకుంటే ఏం చేయలేమని అన్నారు. నిలదీసిన మహిళలను బయటకు పంపిం చాలని పోలీసులను ఆదేశించారు.
ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటదని అన్న మంత్రి.. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టని ఓ మహిళను నిలదీశారు. మరో మహిళను బయటకు వెళ్లిపొమ్మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడుతాయా..? రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది. చెబితేనే దళిత బంధు ఇస్తాం. దళిత బంధు మీకు మేమియ్యం. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుండే తీసుకోండి. బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్ అయ్యారు.
అర్హులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతూ వారం రోజుల కిందట మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు కలెక్టరేట్ ను నర్సాపూర్ – జి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బతుకమ్మ చీరలు, ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నర్సాపూర్(జి) మండలానికి అనేక దేవాలయాలు, కేజీబీవీ పాఠశాల, 30 పడకల ఆసుపత్రి, సెంట్రల్ లైటింగ్ పనులకు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. దళితబంధు పథకం అర్హులందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీపీ కొండ్ర రేఖ, జడ్పీటీసీ చిన్న రామయ్య ఎంపీటీసీ మల్లేశ్ పాల్గొన్నారు.