సింగరేణి ఓపెన్‌కాస్టులో కార్మికుల ఆందోళన
-నాలుగురోజులుగా ఓవర్‌బర్డెన్ పనులకు ఆటంకం
-భారీగా మోహరించిన నాలుగు సర్కిళ్ల పోలీసులు
-ఉద్రిక్తంగా మారిన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టు ఏరియా
Concern of workers in Singareni Opencast: సింగరేణి ఓపెన్‌కాస్టులో ప్రైవేటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగురోజులుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సుశీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. అంతేకాకుండా తొమ్మిది నెలల నుంచి పీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. తాము అడిగితే సింగరేణి యాజమాన్యం తమకు ఇవ్వడం లేదని, అందుకే జీతాలు చెల్లించడం లేదని సుశీ యాజమాన్యం చెబుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా కనీసం పట్టించుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. ఎవరైనా ముందు నిలబడి నిలదీస్తే వారిని ఏదో ఒక రకంగా విధుల్లో నుంచి తీసివేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు కార్మికులు దాదాపు నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని నిరసనలు చేపట్టినా కనీసం పట్టించుకోవడం లేదని కార్మికులు వెల్లడించారు. నాలుగు రోజులుగా ఓవర్‌బర్డెన్ తొలగింపునకు బ్రేక్ పడింది. గురువారం కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. దీంతో శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు ఏరియా ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని కార్మికులు వెల్లడించారు.
ఇంత జరుగుతున్నా, దాదాపు నాలుగు రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా కార్మిక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులను మోహరించి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో తమకు జీతాలు, పీఎఫ్, బోనస్ చెల్లించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.