మాదారం మౌనరోదన..
-ఆ టౌన్‌షిప్‌పై ఓపెన్‌కాస్టు పంజా
-తమకు దిక్కేదని ప్రజల ఆందోళన
-ప్రజాప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం మౌనంపై నిరసన
Madaram township is owned by Singareni: సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. బొగ్గు ఉత్పత్తి కేవలం ఓపెన్ కాస్టులతోనే సాధ్యం అని నమ్ముతోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించి ముందుకు సాగుతోంది. అందులో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా రెండు ఓపెన్ కాస్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ ఓపెన్‌కాస్టు ఏర్పాటులో భాగంగా పచ్చని గ్రామాలపై సింగరేణి కన్ను పడింది.
బెల్లంపల్లి ఏరియాలో రెండు ఓపెన్‌కాస్టులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమయ్యింది. గోలేటీ ఓపెన్‌కాస్టుతో పాటు మహావీర్ ఖని ఓపెన్‌కాస్టు సైతం ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మూసివేతకు గురైన ఎంవీకే-1,2,3,4,5,6 భూగర్భ గనులను కలుపుకొని ఎంవీకే ఉపరితల గని ఏర్పాటు కానుంది. ఈ గనుల్లో సుమారు 40 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఓపెన్‌కాస్టు కింద ఎంవీకే 5 ఇంక్లైన్, 3 ఇంక్లైన్‌తో పాటు మాదారం టౌన్‌షిప్ సైతం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాము ఎక్కడికి వెళ్లాలనే విషయంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామంలో రిటైర్డ్ కార్మికులు, మరికొందరు జీవనం సాగిస్తున్నారు. గతంలో తమకు కేటాయించిన క్వార్టలలో కొందరు ఉంటుండగా, మరికొందరు ఇక్కడే ఇండ్లు కట్టుకుని బతుకుతున్నారు. ఈ గ్రామం ఓపెన్‌కాస్టు కింద పోతుందని కొంతమంది, అలాంటిది ఏమీ లేదని మరికొంత మంది భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దీనికి తోడు ఇక్కడ ప్రజాప్రతినిధులు, నేతలు తమకు తోచింది చెబుతూ స్థానిక ప్రజలను మభ్య పెడుతూ వారు సైతం కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం వారు కూడా నిజాలు తెలుసుకుని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఊరు ఉంటుందా..? ఉండదా..? ఓపెన్‌కాస్టు ప్రభావితం అయితే ఎక్కడి వరకు అవుతుంది..? ్రపజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విషయం స్పష్టం చేయడం లేదు. దీంతో ప్రజలు భయాల మధ్యే కాలం వెళ్లదీస్తున్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్ఎస్ నేతలు, టీబీజీకేఎస్ నేతలు సైతం కనీసం మాట్లాడం లేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తారు. ఆయన హామీ ఇస్తారు.. తర్వాత అంతా షరా మాములే. ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మాదారం టౌన్‌షిప్‌కు పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఏకంగా ఊరే లేకుండా పోతోంది. అయినా దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ నేతల విషయం పక్కన పెడితే ఇక్కడ ఎంపీటీసీగా కాంగ్రెస్ నేత సూరం రవీందర్ గెలిచారు. అటు కాంగ్రెస్ నేతలు, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ నేతలు ఊరి గురించి కనీసం పట్టించుకోవడం లేదు.