మంటలు పుట్టిస్తున్న మాటలు..
-దళిత బంధుపై చేసిన వ్యాఖ్యలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తలనొప్పులు
-నిర్మల్ నియోజకవర్గం అంతటా నిరసనల వెల్లువ
-మంత్రి మాటలపై అధిష్టానం సైతం ఆరా
Minister Indrakaran Reddy’s words are causing fire: దళితబంధు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ పథకం నా ఇష్టం వచ్చిన వారికే ఇచ్చుకుంటా.. అని ఆయన అన్న మాటలు మంటలు పుట్టిస్తోంది. నిర్మల్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనల వెల్లువ కొనసాగుతోంది. దీంతో తాను అనుకున్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేక.. ఏం చేయాలో అర్ధం కాక మంత్రి తల పట్టుకుంటున్నారు.
నాలుగు రోజుల కిందట మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. దళితబంధు పథకానికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు కేవలం మీ అనుచరులకే ఇస్తున్నారని మహిళలు సభలో నిలదీశారు. దీంతో మంత్రి మా ఇష్టం వచ్చినోళ్లకు ఇచ్చుకుంటం.. నువ్వు బయటకు పో.. ఇచ్చింది ఎక్కువ అయితే గట్లనే ఉంటంది..బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దళిత మహిళపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం నిర్మల్ జిల్లాలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా మొత్తం అట్టుడుకుతోంది. ఆ వ్యాఖ్యల తర్వాత చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఆరా తీసిన అధిష్టానం..
మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి తీరని నష్టం చేకూరుతోందని నిఘా వర్గాలు నివేదిక పైకి పంపించారు. అంతేకాకుండా, సొంత పార్టీలోనే ఈ వ్యవహారంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మంత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముంది… వాస్తవానికి దళిత బంధు టీఆర్ఎస్ వారికే ఇస్తున్నారు కదా..? అదే విషయాన్ని మంత్రి స్పష్టం చేశారని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోల్ చేస్తున్నారు. మంత్రిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మంత్రిపై ముప్పేట దాడి కొనసాగుతోంది.
అనడానికి కారణాలివేనా…?
మంత్రి వ్యాఖ్యలు చేసిన రోజు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. బాసర ట్రిపుల్ ఐటీ కార్యక్రమం అనంతరం నర్సాపూర్ జీలో దళితబంధు చెక్కుల పంపిణీతో పాటు వివిధ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారని షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఇంద్రకరణ్‌రెడ్డి మినహా ముగ్గురు మంత్రులు వచ్చిన హెల్‌కాప్టర్‌లో వెనుతిరిగారు. హంగూ ఆర్భాటాలు కటౌట్లు బ్యానర్లు ఏర్పాటు చేసినా మంత్రి కేటీఆర్ పర్యటన రద్దుతో మంత్రి ఐకే రెడ్డి నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా, నర్సాపూర్ జీ గ్రామస్తులు దళితబంధు అర్హులకు అందడం లేదని మంత్రి క్యాంప్ కార్యాలయంతో పాటు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు. అది కూడా మంత్రి ఆగ్రహానికి కారణమైంది.
ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి నిత్యం సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొంటునే ప్రజలకు సావధానంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకానీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇలాగే ఉంటుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎలా భయపడతారనేది చూడాలి…