చెయ్యిచ్చి.. తిరిగి కారెక్కి..
-కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరిన నల్లాల దంపతులు
-పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ చీఫ్ కేటీఆర్
Nallala Odelu couple who left Congress party and joined TRS: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం ప్రగతిభవన్ లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మున్సిపల్ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 19న మాజీ ఎమ్మెల్యే తో పాటు ఆయన సతీమణి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నాలుగున్నర నెలలకే తిరిగి టీఆర్ఎస్లో చేరారు. తిరిగి గులాబీ గూటికి చేరడం చాలా ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఒదేలు, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బిఅర్ఎస్ పార్టీని అధికారికంగా ప్రకటిస్తున్న సమయంలో ఈ చేరిక ఆ పార్టీలో జోష్ నింపింది. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, వాల శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓదెలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన భార్య భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.