ముఖ్యమంత్రిగా ఉంటా.. దేశమంతటా పర్యటిస్తా
-తెలంగాణను అభివృద్ధి చేసినట్లే.. దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం
-దేశ ప్రజల సమస్యలే మన ఎజెండా
-మీరు తెలంగాణా సాధించిన యోధులు
-అదే స్ఫూర్తితో దేశ సేవ చేయడానికి కదులుదాం
-బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్బంగా కేసీఆర్
KCR entered the national politics: ‘నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతటా పర్యటిస్తా… కార్యక్షేత్రం వదలను. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేద’ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో ఇంతటి అభివృద్ధిని సాధించడానికి మనం తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే.. దేశం కోసం కూడా కష్టపడి పనిచేసి సాధించి చూపెడదామని అన్నారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్ననిర్ణయం కాదని స్పష్టం చేశారు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడ్డ వల్ల అభివృద్ధి జరగట్లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పబడే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నరని అన్నారు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదని అన్నారు.
1980 వరకు చైనా జిడిపి మన దేశం కన్నాతక్కువగా ఉండేది. 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయి. మనం కూడా అలా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ లో అమలవుతున్న పథకాలు దేశ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అమలు చేసి వుంటే బాగుండేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే మనం జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నమని తెలిపారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని మనం జాతీయ పార్టీ జండాను పట్టుకుని పోతున్నమని చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీళ్లు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా ? దేశమంతా ఇవ్వొచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. మనం అదే కమిట్ మెంట్ తో దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీల్లను అందించాలె. ఇందుకు చైనాతో, పాకిస్తాన్ తో అమెరికాతోనో యుద్దం చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ సమావేశంలో కూర్చున్న వాల్లంతా తెలంగాణ సాధించిన యోధులు…వీరు అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు.
ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నది. మన దేశంలోని వనరులు మన దేశంలోనే వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామన్నారు. మనకు ఇంకా మంచి సమయం ఉన్నది. మనం దేశవ్యాప్తంగా విస్తరిస్తమని వెల్లడించారు. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటమని,. మన జాతీయ పార్టీ కి అనుబంధ రైతు సంఘటన ను మొదట మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తమని స్పష్టం చేశారు. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతది. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.