ఆ మంత్రికి పార్టీ పేరు తెలియదు(ట)
-బీఆర్ఎస్ పార్టీని బీఎస్పీ అని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు
-సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ప్రతిపక్ష నేతలు
Minister Errabelli Dayakar Rao who changed the name of BRS party: కొందరు ఏది మాట్లాడినా వివాదస్పదం అవుతుంది.. అది తెలిసి, మాట్లాడినా తెలియకుండా మాట్లాడిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ కొద్ది మందిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. ఆయన పలు సందర్బాల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవుతూనే ఉన్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రితో జరిగే ప్రతి సమావేశంలో ఆయన వెంటే కనిపిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చే సమయంలో సైతం పలు సమావేశాల్లో కేసీఆర్ తో తిరిగారు. సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర నేతలకు ముఖ్యమంత్రి కల్పించిన అవగాహన సమావేశాల్లో ముందు వరుసలో ఉన్నారు. అయితే, ఆయనకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) పేరు కూడా తెలియకపోవడం గమనార్హం.
బుధవారం వరంగల్‌లో రావణ దహనం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. అదే సమయంలో కొత్తగా పార్టీ పెట్టారని భారతీయ అని అన్న మంత్రి పార్టీ పేరు గుర్తుకు రాకపోవడంతో ఎదురుగా ఉన్న కార్యకర్తలను అడిగారు. వారిలో కొందరు బీఎస్పీ అనడంతో బీఎస్పీ జాతీయ స్థాయి పార్టీగా ప్రకటించారని అనడంతో మంత్రి కూడా బీఎస్పీ ప్రకటించారని దానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. వాస్తవానికి బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ది కావడం గమనార్హం.
గతంలో సైతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ మహిళా అధికారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం వివాదం అయ్యాయి. మహిళా అధికారిని ఉద్దేశించి మీరు బాగానే ఊపుతున్నారు. కానీ ఈమె ఇక్కడ ఊపడం లేదంటూ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. మరోసారి హన్మకొండి జిల్లా పత్తిపాకలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ఖాళీ సీసాలు అమ్మిన డబ్బులు పంచాయతీ నిధుల్లో జమ చేయాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారంటూ అన్నారు. ఆ నిధులతో గ్రామ పంచాతీయలను నడిపించాలని కోరారు. ఈ వ్యాఖ్యాలపై సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ సిబ్బంది నిరసనలు వ్యక్తం చేశారు.
ఏదిఏమైనా మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే పార్టీ పేరు మరిచిపోవడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి పార్టీ పేరు ఒకటికి రెండు సార్లు మననం చేసుకుని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నారు.