దండకారణ్య డాక్టర్స్ టీం కమాండర్ కమల అరెస్టు
-ఇద్దరు మావోయిస్టులతో సహా ఐదుగురు అరెస్టు
-50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటనేటర్లు, 74వేల నగదు, బోలెరో కారు, సెల్ఫోన్లు స్వాధీనం
-వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్
Two Maoists and three sympathizers were arrested: దండకారణ్య సౌత్ సబ్ జోన్ డాక్టర్స్ టీం కమాండర్ కమల, నేషనల్ ఏరియా మావోయిస్టు పార్టీ సభ్యుడు అసం సోహెన్‌తో సహా ఐదుగురిని హన్మకొండ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటనేటర్లు, 74వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం , ఒక బోలెరో కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. హన్మకొండలో మావోయిస్టుల సంచారం ఉందనే సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం పోలీసులు ములుగు రోడ్డు ప్రాంతంలో ఆజర ఆసుపత్రి ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. బోలేరో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా, అందులో ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులుగా తేలింది. పట్టుబడిన వారిలో మడకం ఉంగి అలియాస్ కమల (దండకారణ్య సౌత్ జోన్ కమిటీ సభ్యురాలు) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు వచ్చింది.
ఆమెతో పాటు ముగ్గురు సానుభూతిపరులు కూడా ఉన్నారు. కమలతో పాటు వచ్చిన అసం సోహేన్ ఇక్కడే రెండు బాక్సుల్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. మహిళా మావోయిస్టు ఉంగి అలియాస్ కమలకి చికిత్స పూర్తయిన అనంతరం ఛత్తీస్ ఘడ్ వెళ్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో మడకం ఉంగి అలియాస్ కమల, (దండకారుణ్య సౌత్ సబ్ జోన్ డాక్టర్స్ టీం కమాండర్)ది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. పదిహేను సంవత్సరాల వయస్సులో మావోయిస్టు పార్టీ ఆనుబంధ సంస్థ బాలల సంఘంలో చేరింది. తమ గ్రామానికి వచ్చే మావోయిస్టు సభ్యులకు నిత్యావసర సరుకులతో పాటు పార్టీకి అవసరమైన వస్తువులను అందజేస్తూ 2007 వరకు బాలల సంఘంలో పనిచేసింది.
9వ ప్లాటూన్ లో చురుకు పనిచేస్తున్న ఉంగి అలియాస్ కమలను మావోయిస్టు పార్టీ నాయకత్వం పామేడ్ ఏరియా డాక్టర్స్ టీం సభ్యురాలిగా నియమించింది. 2012లో సౌత్ సబ్ జోనల్ బ్యూరో టీం ఇంచార్జ్ గా నియమితురాలైన ఉంగి పదిహేను రోజుల పాటు డాక్టర్స్ కోర్సులో ప్రత్యేక శిక్షణ పొందింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగే ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులకు ఆమె చికిత్స అందించేది. 2017లో చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్కా పాల్ అటవీ ప్రాంతంలో పోలీసులపై చేసిన దాడి చేసి 25మంది పోలీసులను హత్య చేసిన ఘటనలో నిందితురాలు. 2018లో మినప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ఇద్దరు పోలీసులను హత్య చేసి, ఆరుగురు పోలీసులను తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో సైతం ఆమె పాల్గొన్నారు. 2020 మార్చిలో చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల చేతిలో 17 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో పాటు 2021లో గుట్టపరివార ప్రాంతంలో అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 24 మంది బీజపూర్ పోలీసులను హత్య చేసిన ఘటనలో సైతం పాల్గొన్నారు.
ఇక మరో మావోయిస్టు అసం సోహెన్ (మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు, నేషనల్ ఏరియా) ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడిగా పనిచేసాడు. 2019లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నేషనల్ పార్క్ ఏరియా సెక్రటరీ దిలీప్ వింజ అధ్వర్యంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా నియమించారు. అసం సోహెన్ మావోయిస్టు సభ్యుడిగా బీడీ ఆకుల కాంట్రాక్టర్లు, ఇతరుల దగ్గర నుంచి పార్టీ ఫండ్ వసూలు చేసేవాడు. పార్టీకి అవసరమైన నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి పార్టీకి అందజేసేవాడు. మావోయిస్టు పార్టీకి అవసరమయిన పేలుడు పదార్థాలను వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో కొనుగోలు చేసి మావోయిస్టు పార్టీకి అందజేసేవాడు.
మావోయిస్టులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసిపి కిరణ్ కుమార్ టాస్క్ ఫోర్స్, హనుమకొండ ఇనన్స్ స్పెక్టర్లు సురేష్ కుమార్, శ్రీనివాజీ, టాస్క్ ఫోర్స్ , హనుమకొండ ఎస్.ఐలు లవణ్ కుమార్,నిసార్ పాషా, రాజు, ఉమ, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్లు శ్యాంసుందర్, సోమలింగం, మాధవరెడ్డి, అశోక్,స్వర్ణలత, కానిస్టేబుళ్ళు నవీన్, శృజన్, శ్రవణ్ కుమార్, నాగరాజు, రాజు, సురేష్, శ్యాం సుందర్, శ్రీధర్, శ్రీనులను సెంట్రల్ డీసీపీ అశోక్ కుమార్ అభినందించారు.