వాళ్ళు కోవర్ట్ రెడ్డిలు..
కోమటిరెడ్డి బ్రదర్స్ పై కేటీఆర్ ఆగ్రహం
KTR’s anger on Komatireddy brothers: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు అని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మోదీ తన బుట్టలో వేసుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుని, ఈ పథకాన్ని దేశం మొత్తం అమలు చేయండని కేంద్రానికి సూచించిందని కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందన్నారు. ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రజల కోసం రూ. 19 వేల కోట్లు ఇవ్వమంటే మోదీకి మనసు ఒప్పలేదని, కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని దుయ్యబట్టారు.
మోదీ అన్నదమ్ముళ్లను బుట్టలో వేసుకున్నారని తెలిపారు. ఈయనేమో బీజేపీలోకి జొర్రిండు. అన్ననేమో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారట. ఎలక్షన్ అయిపోయాక తిరిగి వస్తడట అని ఎద్దేవా చేశారు. అన్న కాంగ్రెస్ ఎంపీ, ఈయనేమో బీజేపీలో జొర్రిన నేత. వీళ్లిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్ట్ రెడ్డిలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు వీరు. ఈ చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలియజెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గల్లిగల్లీకి, ఇంటింటికీ ఈ విషయాన్ని చెప్పాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు._