అవమానాలు దిగమింగుకుని పనిచేశాం
-మిమ్మల్ని కనీసం కలవడానికే పెద్ద ఉద్యమం చేయాలి
-మీతో రాజకీయబంధం దూరమైనందుకు చింతిస్తున్నాం
-టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Former MP Boora Narsaiah Goud resigned from TRS party:‘‘పార్టీలో ఎన్నో అవమానాలు జరిగినా దిగమింగుకుని పనిచేశాం. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో మాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగాం.. అది తెలిసి కేసీఆర్ మౌనంగా ఉన్నారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదు, కానీ బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించండి అని అడగటం కూడా నేరమేనా..?’’ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉండటమే అనవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. నేను మీ నాయకత్వంలో టీ-జాక్ లో శక్తి వంచన లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. తనకు భువనగిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. భువనగిరి ఎంపీగా గెలిచి నియోజక అభివృద్ధికి, ఇటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేశానని స్పష్టం చేశారు. దాని ఫలితంగానే ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారులు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి అవినీతి, ఆరోపణ లేకుండా పనిచేసానని బూర నర్సయ్య వెల్లడించారు.
2018 లో భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎంఎల్ఎ ల గెలుపు కోసం తన శక్తి మేరకు కృషి చేశానని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే కసితో పని చేశానని బూర ఆ లేఖలో పేర్కొన్నారు. 2019 నాకు మళ్ళీ ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, కానీ బుల్డోడర్ గుర్తు, అంతర్గత కుట్రల వలన స్వల్ప మెజారిటీతో ఓడిపోయానని, అది కేసీఆర్ కు కూడా తెలుసునన్నారు. మీరు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత భావంతో ఇన్నాళ్లు ఎన్నో అవమానాలు జరిగిన భరించానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. పదవుల కోసం, పైరవీలు చేసే వ్యక్తిత్వం నాది కాదని వెల్లడించారు.
మిమ్మల్ని కలిసి ప్రజా సమస్యలు విన్నవించుకునే అవకాశం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల సమస్యలను నేను పదే, పదే ప్రస్తావిస్తే.. దాని గురించి మీరు నా పై అసహనం వ్యక్తం చేయడం ఉద్యమ కారుడిగా ఎంతో బాధించిందన్నారు. నేను ఎప్పుడు ప్రజల సమస్యలు తప్ప, వ్యక్తిగత ప్రయాజనాల కోసం మీ వద్ద పైరవీలు చేయలేదని కేసీఆర్ కు గుర్తు చేశారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో నా అవసరం పార్టీకి లేదని తెలిసిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవి కేసీఆర్ దృష్టికి తీసుకోవద్దామంటే అవకాశమే ఉండదు. ఇక నేను టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఏమి చేయాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచిన సన్నిహితులు, సహచర ఉద్యమకారులు కనీసం ఒక నిముషం కలవాలంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ కు కనీసం 6 అంగుళాల విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టకపోవడం అందరిని బాధిస్తోందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ మీద అభిమానంతో ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఇప్పటి వరకు ఉన్నానని వెల్లడించారు. అభిమానానికి, బానిసత్వానికి చాల తేడా ఉందన్నారు బూర నర్సయ్య గౌడ్. నేను అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చే అవకాశమే లేనప్పుడు, నేను తెరాస పార్టీలో కొనసాగడం అర్థరహితమని స్పష్టం చేశారు. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ తో, మీ కుటుంబ సభ్యులతో రాజకీయ బంధం దూరమైనందుకు చింతిస్తు పార్టీకి రాజీనామా చేస్తున్నానని బూర నర్సయ్య వెల్లడించారు.