అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులే
-అధికార పార్టీలో లోలోపల కుమిలిపోతున్న నేతలు
-బయటకు మాత్రం పట్టుమీదున్నట్లు కనిపిస్తున్న వైనం
-కాంగ్రెస్ పార్టీలో ముచ్చటగా మూడు గ్రూపులు
-బీజేపీ బలపడినా గ్రూపుల కొట్లాటే
-ఎర్ర జెండాకు నడిపించే నాయకత్వం సున్నా
-బెల్లంపల్లి నియోజకవర్గ ముఖ చిత్రమిది
-నియోజకవర్గ ముఖచిత్రం - 1
All parties are unhappy in Bellampally constituency: అధికార పార్టీ నుంచి మొదలుకుని అన్ని పార్టీలది అదే పరిస్థితి. గ్రూపుల గొడవలు, ఆరని అసంతృప్తులు. నేతలు, క్యాడర్ గ్రూపులుగా విడిపోయే ఆధిపత్యం కోసం పోరు. అధికార పార్టీ అంటే పదవుల కోసమో, ఇంకా దేనికోసమైనా పట్టువిడుపులు కామన్. కానీ ప్రతిపక్షాల్లో సైతం అదే అనైక్యతం. నేతలు గ్రూపులుగా మారి గల్లాలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితిపై నాంది న్యూస్ ఆరా తీసింది. ఆ నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి, నేతలు వైఖరిపై దృష్టి సారించింది. అన్ని నియోజకవర్గాల్లో ఒక రకమైన పరిస్థితి ఉంటే, బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం ఇంకో రకమైన పరిస్థితి ఉంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో పరిస్థితిపై నాంది ప్రత్యేక కథనం..
బయటకు గంభీరం.. లోపల ఆందోళనకరం..
బయటకు చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా గంభీరంగా, మంచి పట్టు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, అంతర్గతంగా మాత్రం మండలాల వారీగా నేతల పోరుతో సతమతం అవుతోంది. నెన్నల మండలంలో ఎంపీపీ సంతోషం రమాదేవిని ఏకాకి చేయడం కోసం జడ్పీటీసీ సింగతి శ్యామల భర్త రాంచందర్, పీఎస్‌సీఎస్ చైర్మన్ మేకల మల్లేష్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, మరికొందరు సర్పంచ్‌లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, పిలిచినా అజమాయిషీ మొత్తం వారే చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త పెన్షన్ మంజూరు విషయంలో సైతం వివాదం చెలరేగింది. గ్రామాల వారీగా జాబితా ఎంపీపీ వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. దానిపై ఎంపీడీవోను, ఎంపీపీని బూతులు సైతం తిట్టినట్లు సమాచారం. ఎంపీపీని బూతులు తిట్టినా నేతలను కనీసం మందలించకపోవడం పట్ల పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పీఏ బీమాగౌడ్ ఈ వర్గానికి అండగా ఉన్నారని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఈ విషయాలేవీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దృష్టికి పోకుండా చేస్తున్నారని సమాచారం.
దూరంగా తెలంగాణ ఉద్యమకారులు..
బెల్లంపల్లి పట్టణంలో టీఆర్ఎస్ నేత బొడ్డు నారాయణ అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన కౌన్సిలర్‌గా పోటీ చేశారు. ఆయన వైస్‌చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాల్లొ పాల్గొంటున్నా ఎడమోహం పెడమోహంగానే ఉంటున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వారిని కలుపుకుపోవడం లేదనే అపవాదు ఉంది. సీనియర్ నేత నర్సింగం, మాజీ చైర్‌పర్సన్ స్వరూపారాణి సైతం పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. సీనియర్ ఎల్తూరి శంకర్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పని చేశారు. ఆయనను పట్టించుకోకపోవడంతో ఏఐటీయూసీలో చేరారు. మిగతా మండలాల్లో సైతం పార్టీలో లుకలుకలు ఉన్నా ఇప్పటికిప్పుడు బయటపడటం లేదు. ఎన్నికల ముందు అసమ్మతి నేతలంతా ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
కాంగ్రెస్ మూడుముక్కలాట..
ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కొద్ది రోజులుగా ప్రేంసాగర్ రావు వర్సెస్ వినోద్ గా ఇక్కడ రాజకీయం నడిచింది. వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇష్టం లేని ప్రేంసాగర్ రావు ఆయనకు తన అనుచరుల ద్వారా చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో వినోద్ ప్రేంసాగర్ రావు పంచన చేరారు. అప్పటి వరకు ప్రేంసాగర్ రావును వ్యతిరేకించిన వర్గం కాస్తా మాజీ మంత్రి బోడ జనార్దన్ పంచన చేశారు. మాజీ జడ్పీటీసీ కార్కూరి రాంచందర్ తటస్థంగా ఉంటున్నారు. చిలుముల శంకర్ ప్రేంసాగర్ రావును వ్యతిరేకించి ఇప్పుడు ఆయనతోనే కలిసిపోయి పనిచేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మత్తమారి సూరిబాబు బోడ జనార్దన్‌తో మూడో వర్గంగా కొనసాగుతున్నారు.
కాస్తంత నయం.. లేని సమన్వయం..
బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి గతంతో పోల్చితే చాలా మెరుగైంది. అధికార పార్టీని నిలదీయడంలో ఆ పార్టీనే ముందుందని చెప్పొచ్చు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే, ఆ పార్టీకి ముందుండి నడిపే నాయకత్వం కొరత ఉంది. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ వివేక్ వర్గం కాగా, గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన కొయ్యల హేమాజీ మరో వర్గంగా సాగుతున్నారు. దీంతో ఉన్న కొద్ది మంది కార్యకర్తలు తటస్థంగా ఉంటున్నారు. ఇక్కడ వర్గ విబేధాలు ఉన్నా, పార్టీ నిర్మాణ పరంగా మాత్రం ముందుకు వెళ్తున్నారు.
నడిపించే నాయకత్వం కొరత..
బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐ పార్టీ బలంగానే ఉంటుంది. అయితే, ఆ పార్టీ నేత గుండా మల్లేష్ మరణం తర్వాత ఇక్కడ రాజకీయ శూనత్య ఏర్పడింది. నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్ ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. పొత్తులో భాగంగా టీఆర్ఎస్ ఈ సీటును వదులుకుంటే ఆయనను పోటీలో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ కు నమ్మిన బంటు కావడంతో ఆయనకు టిక్కెట్టు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీకి పెద్ద ఎత్తున సానుభూతిపరులు, కార్యకర్తలు ఉన్నారు. కానీ వాళ్లను ముందుడి నడిపించే నాయకత్వం లోపించింది. కొందరు నాయకులు ఉన్నా సరైన పోరాటం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.