అభివృద్ధి మంత్రం.. రాజకీయతంత్రం
-చెన్నూరులో కొనసాగుతున్న వన్‌మాన్ షో
-ఎదురులేకుండా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్
-చేతికి వచ్చిన అస్త్రాన్ని వదులుకున్న కాంగ్రెస్
-బీజేపీ పరిస్థితి నామ మాత్రంగానే
-చెన్నూరు నియోజకవర్గ రాజకీయ వైచిత్రి
-నియోజకవర్గ ముఖచిత్రం - 2
Balka Suman’s one-man show going on in Chennuru:అధికార పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. తమకు అభివృద్ధి ఫలాలు అందలేదనో, ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదనో ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో మిగతా పార్టీలు సైతం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని, స్థానికంగా ఉన్న నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ వన్‌మాన్ షో నడిపిస్తున్నారు. అటు అభివృద్ధికి నిధులు తీసుకువస్తూ.. రాజకీయంగా ఎవరూ తనకు ఎదురులేకుండా చూసుకుంటున్నారు. దీంతో చెన్నూరు నియోజకవర్గం మిగతా వాటితో పోల్చితే కాస్తా భిన్నంగానే కనిపిస్తోంది.
చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కొనసాగుతోంది. దీనికి ఇక్కడి ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రోడ్డు, రవాణా సౌకర్యాలు విస్తరించడం, మౌలిక సదుపాయాల కల్పనలపై బాల్క సుమన్ దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తనకున్న చొరవ, సాన్నిహిత్యంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారు. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అదే సమయంలో రాజకీయంగా తనకు ఎదురవుతున్న సమస్యలను సైతం చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్ది రోజుల కిందట తనను విబేధించి పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులను తిరిగి వెనక్కి తీసుకురావడంతో పాటు బీమారం మండలంలో తనకు వ్యతిరేకంగా గళం విప్పిన చెరుకు సరోత్తం రెడ్డిని తన దారికి తెచ్చుకున్నారు. దీంతో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి మాత్రం టీఆర్ఎస్ పార్టీకే పూర్తి అనుకూలంగా ఉంది.
చేతికి వచ్చిన అస్త్రాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించాల్సిన అవసరం లేదు.. ఆ పార్టీని ఆ పార్టీ నేతలే ఓడిస్తారన్న నానుడి ఇక్కడ అక్షర సత్యంగా మారుతోంది. ఆ పార్టీకి జవసత్వాలు నింపే పనిలో అధిష్టానం ఉంటే.. స్థానిక నేతలు మాత్రం ఆ పప్పులేం ఉడకవనే పరిస్థితి తీసుకువస్తున్నారు. కొద్ది రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నిండుతాయని టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ, ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఇమడకుండా సొంత పార్టీ నేతలే కుంపటి పెట్టారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఆయనకు పొమ్మనలేక పొగ పెట్టారు. దీనిని అవకాశంగా తీసుకున్న టీఆర్ఎస్ నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మిని తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బనే.
ఉన్న నేతల్లోనే రెండు గ్రూపులు..
ఇక ఇప్పటికి సైతం ఆ పార్టీని గ్రూపుల గోల వదలడం లేదు. ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌ది ఒక వర్గం కాగా, ప్రేంసాగర్ రావుది మరో వర్గంగా కొనసాగుతోంది. తన అనుచరుడు నూకల రమేష్‌ను ఎలాగైనా గెలిపించి తన సత్తా చూపాలని ప్రేంసాగర్ రావు భావిస్తున్నారు. అందుకే ఇక్కడకు ఏ నేత వచ్చిన వారికి ఊపిరి సలపకుండా చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఆయన చర్యలతో పార్టీకి తీరని నష్టం కలుగుతోంది. ఈ రెండు వర్గాల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు, అనుచరులు ఎవరికి వారు సైలెంట్ గా ఉంటున్నారు. సుమన్ లాంటి నేతను ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చిన్న సూత్రాన్ని మరిచిన కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. గతంలో కాస్తో, కూస్తో పోటీ పడిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కనీసం ఓట్లు సాధించడం కూడా గగనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
భారతీయ జనతాపార్టీకి జవసత్వాలు నిండేనా..?
ఇక్కడ భారతీయ జనతాపార్టీకి జవసత్వాలు నింపేందుకు సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల కాస్తోకూస్తో బలంగా ఉన్న ఆ పార్టీ ఇప్పటికిప్పుడు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ సీనియర్ నాయకులు, మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్, పట్టణ విభాగం నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ కాస్తంత బలహీన పడింది. పట్టణాల్లో కొంచం బలంగా ఉన్నా… గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా క్యాడర్ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్‌గా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అందుగుల శ్రీనివాస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయనకు కేవలం 2,026 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కూడా అంతకు మించి గొప్పగా ఏం కనిపించడం లేదు.