అంతర్ రాష్ట్ర కిడ్నాపర్ల ముఠా అరెస్ట్
-ఒక తుపాకీ, రెండు తూటాలు, ఐదుసెల్‌ఫోన్లు స్వాధీనం
-మహిళతో కలిసి బ్లాక్‌మెయిలింగ్, తర్వాత కిడ్నాప్
-ఐదుగురు వ్యక్తుల అరెస్టు, పరారీలో మరో ఇద్దరు
Gang of inter-state kidnappers arrested: పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీని మహిళ సాయంతో ప్రలోభపెట్టి డబ్బుల కోసం డిమాండ్ చేసి అనంతరం కిడ్నాప్ చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను నిర్మల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దేశీయ పిస్తోల్, రెండు తూటాలు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంటకు చెందిన అక్కిరాల రవికుమార్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఆరు నెలల కిందట కుమ్మరికుంటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. తనకు పిల్లలు కావడం లేదని చెప్పి ఆర్ఎంపీ రవికుమార్‌తో ఆ వివాహిత పరిచయం పెంచుకుంది. ఆమెతో అప్పటికే పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రవికుమార్‌కు ఫోన్ చేయించి మాటలతో ప్రలోభపెట్టేవారు. ఆమె పేరుతో WhatsApp చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఆ వివాహితతో రవికుమార్ కు ఫోన్ చేయించి, నిర్మల్ బస్ స్టాండ్ కు రమ్మని చెప్పించారు. ఈ నెల 18న రవికుమార్ కుమ్మరికుంట నుండి నిర్మల్ బస్టాండ్ కు చేరుకున్నాడు.
దీంతో ఆ మహిళ తన బంధువు, కారు డ్రైవర్ అయిన రాథోడ్ జ్ఞానేశ్వర్ తో కలిసి రవికుమార్ ను మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ధనోర అటవి ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ వివాహిత కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పి కారు దిగింది. పథకం ప్రకారం రెండు మోటార్ సైకిళ్ళపై అక్కడకు చేరుకున్న ఆమె ముఠా సభ్యులు బానోతు మారుతి, రాథోడ్ ఉద్దాల్, రాథోడ్ కార్తీక్, రాథోడ్ జ్ఞానేశ్వర్ రవికుమార్ ను కాళ్ళు చేతులను తాళ్ళతో కట్టివేసి, నోటిలో గుడ్డలు కుక్కి, ఐదు లక్షలు ఇవ్వాలని, లేదంటే తుపాకి తో కాల్చి చంపుతామని బెదిరించారు.
తర్వాత ఆ వివాహిత జ్ఞానేశ్వర్ బైక్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాథోడ్ ఉద్దవ్, రాథోడ్ కార్తీక్ రవికుమార్ ను మోటార్ సైకిల్ పై వంజర్ గ్రామం సారంగాపూర్ మండలం వైపు తీసుకెళుతుండగా గ్రామస్తులు గమనించి అడ్డుకున్నారు. దీంతో ఉద్దవ్, కార్తీక్ నుంచి రవికుమార్ తప్పించుకున్నాడు. నిందితులు ఇద్దరూ మోటార్ సైకిల్‌పై పారిపోయారు. రవికుమార్ సారంగాపూర్ పోలిస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో జగిత్యాల జిల్లా కు చెందిన బానోత్ మారుతి, నిర్మల్ జిల్లాకు చెందిన మహిళతో పాటు, నాందేడ్ జిల్లాకు చెందిన రాథోడ్ ఉద్దాల్, రాథోడ్ కార్తీక్, రాథోడ్ జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దేశవాళీ తుపాకీ, రెండు తూటాలు అమ్మిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌రజాక్, కారు తెచ్చిన వ్యక్తి అంకమెల్ల శ్రావణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.