అంగన్వాడీ కోడిగుడ్లు, పాలు బహిరంగ మార్కెట్‌కు..
పట్టుకున్న సీసీసీ పోలీసులు, అంగన్వాడీ టీచర్లపై కేసు నమోదు
మంచిర్యాల – గర్భిణులు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలను కొందరు అంగన్వాడీ టీచర్లు బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న ఈ మోసాలపై సీసీసీ నస్పూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు, పాలు బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొందరు అంగన్వాడీ టీచర్లు, ట్రాలీ డ్రైవర్‌తో చేతులు కలిపి కోడిగుడ్లు, పాలు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సీసీసీ నస్పూరులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ట్రాలీలో అంగన్వాడీకి సంబంధించిన కోడిగుడ్లు, పాలపాకెట్లు గుర్తించారు.
దీనిపై ఆరా తీయగా వేమనపల్లి, కోటపల్లి, జైపూర్, బీమారం మండలంలోని అంగన్వాడీ టీచర్ల వద్ద నుంచి తీసుకువస్తున్నట్లు ట్రాలీ డ్రైవర్ సంతోష్ అంగీకరించాడు. ప్రభుత్వం గర్భిణులు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం కోడిగుడ్లు, పాలను వారికి పూర్తిగా ఇవ్వకుండా ప్రభుత్వ రికార్డుల్లో వారికి ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ వాటిని మంచిర్యాలలో ఇతరులకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు.
ట్రాలీ డ్రైవర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నవి..
– కోటపల్లి మండలం నక్కలపల్లి అంగన్వాడీ టీచర్ సరోజ వద్ద నుంచి ఐదు కాటన్ల పాలపాకెట్లు, 3 ట్రేల గుడ్లు
– వేమనలపల్లి మండలం అంగన్వాడీ టీచర్ జయప్రద నుంచి ఐదు కాటన్ల పాలపాకెట్లు, 3 ట్రేల గుడ్లు
ఇదే మండలంలోని రెండవ అంగన్వాడీ టీచర్ రాణి నుంచి 6 కాటన్ల పాలపాకెట్లు, 3 ట్రేల గుడ్లు
– జైపూర్ మండలం కాన్కూర్ అంగన్వాడీ టీచర్ మణెమ్మ వద్ద నుంచి ఆరు కాటన్ల పాలపాకెట్లు, 3 ట్రేల గుడ్లు
– బీమారం మండలం రాంపూర్ అంగన్వాడీ టీచర్ వద్ద నుంచి ఆరు కాటన్ల పాల పాకెట్లు, 3 ట్రేల గుడ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ దందాలో ఇంకా ఎవరి ప్రమేయం ఉన్నదన్న విషయంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.