టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్.. వయా కాంగ్రెస్, బీజేపీ
గులాబీ కండువా కప్పుకోనున్న దాసోజు శ్రవణ్

Dasoju Shravan will join TRS from TRS: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో టీఆర్ఎస్‌లోనే పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ నుంచి తిరిగి టీఆర్ఎస్‌లో చేరనున్నారు.
దాసోజు శ్రవణ్ 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. తన వాగ్దాటితో కొద్ది కాలంలోనే చిరంజీవి, పవన్ కల్యాణ్ కు దగ్గరయ్యారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాసోజుకు 91 వేల ఓట్లు వచ్చాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా కొద్ది కాలానికే కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహతులయ్యారు. వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. శ్రవణ్ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ అధికార ప్రతినిధిగా ఎదిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
దాసోజు శ్రవణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు. ఆయన సొంతూరు భువనగిరి అసెంబ్లీ పరిధిలో ఉంది. ఆయనకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పడకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆగస్టు 7న తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి శ్రవణ్ కు వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ పెద్దల నుంచి హామీ లభించినట్లు సమాచారం. అయితే హఠాత్తుగా తన రూటు మార్చిన శ్రవణ్తె తిరిగి ఈ రోజు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.