దహన సంస్కారాలకు వెళ్లి తేనెటీగల దాడిలో మృతి
హెల్మెట్లు పెట్టుకుని అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు
Went to cremation and died in bee attack: దహన సంస్కారాలకు వెళ్లిన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి… కోటపల్లి మండలం బబ్బర చెల్కకి చెందిన కొండపర్తి చంద్రకాంత(70)అనే మహిళ మృతి చెందింది. ఆమె దహన సంస్కారాలు నిమిత్తం వెళ్లిన గ్రామస్తుల పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మండలంలోని పాత దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు (62) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో చంద్రకాంత మృతదేహానికి దహన సంస్కరాలు చేయకుండానే పారిపోయారు. ఆ ప్రాంతంలో తేనెటీగలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల ఎవ్వరు కూడా అటు వైపు వెళ్ళటానికి సాహసం చేయలేదు. చివరకు కొందరు గ్రామస్తులు హెల్మెట్లు పెట్టుకుని మరీ దహన సంస్కారాలు నిర్వహించారు. తేనెటీగల దాడిలో గాయపడ్డ ఇద్దరిని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతున్నారు.