జడ్పీటీసీ ఇంట్లో అక్రమ కలప స్వాధీనం
Illegal wood seized at ZPTC house:అధికార పార్టీకి చెందిన ఓ జడ్పీటీసీ ఇంట్లో అధికారులు అక్రమ కలప స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం జడ్పీటీసీ సరిత ఇంట్లో అటవీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2 లక్షల విలువైన కలప లభ్యమైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట వాహనంలో కలప లభ్యం అయ్యింది. అటవీశాఖ అధికారులు కూపీ లాగారు. దీంతో పెంచికల్ పేట జడ్పీటీసీ భర్తకు సంబంధించిన కలప వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దీంతో శుక్రవారం వారి ఇంటిలో సోదాలు నిర్వహించారు. పక్కనే ఉన్న రెండు షట్టర్లలో కలప నిల్వ చేశారు. రెండు రోజులుగా వీటిని తెరిపించే ప్రయత్నం చేసిన అదికారులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ రోజు ఉన్నతాధికారుల సమక్షంలో రెండు షట్టర్ లలో ఉన్న కలప స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధి కావడంతో పట్టుబడ్డ కలుప విలువ తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జడ్పీటీసీ సరిత భర్త రాజన్న పై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.