దొరికితే కేసులు, లేకపోతే కాసులు
-బియ్యం అక్రమ రవాణాకు అండగా ఖాకీలు
-చిన్న చిన్న కేసులతో సరిపెడుతున్న రెవెన్యూ అధికారులు
-యధేచ్చగా కొనసాగుతున్న బియ్యం దందా
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలొ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఎన్నో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ బాగోతంలో దొరికితే కేసులు, లేకపోతే కాసులు అన్న చందంగా తయారైంది అధికారుల తీరు. సాధారణంగా ఇలాంటి అక్రమాలపై మొదటగా పోలీసులకు సమాచారం ఉంటుంది. ఈ ప్రాంతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకే ఎక్కువగా సమాచారం అందుతోంది. అయినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్నా అవి నామమాత్రపు కేసులు మాత్రమేననే ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో అక్రమ రవాణా బియ్యాన్ని పట్టుకుని కేవలం వాహనదారులపై కేసులు పెడుతున్నారు. కానీ పట్టుబడిన రేషన్ బియ్యం ఎక్కడ కొనుగోలు చేశారనేది తేల్చడం లేదు. దీని వల్ల అసలు సూత్రధారి సెఫ్ గా ఉంటున్నాడు. ఈ కేసులు చేయడం కూడ ఆ వ్యాపారి కనుసన్నల్లో సాగుతోందనే ప్రచారం కూడా సాగుతోంది. ఎప్పుడు కేసు పెట్టాలి, దానికి వాహనాలు, వ్యక్తులను సిద్దం చేస్తున్నాడు.
ఇక ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కోట్ల రూపాయల రేషన్ బియ్యం దందా సాగుతున్న కనీసం పట్టించుకోక పోవడం సిగ్గుచేటని పలువురు విమర్శితున్నరు. వ్యాపారులపై 6ఎ కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. జెసి కోర్టులో కొంతకాలం తర్వాత జరిమానా కట్టి వాహనాలను విడుదల చేసుకుంటున్నారు. కానీ అసలు పాత్ర దారులను తెరపైకి తీసుకురాకపోవడంలో అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది.