రేషన్ బియ్యం… ‘మహా’ సామ్రాజ్యం
-మహారాష్ట్ర కేంద్రంగా తెలంగాణ పీడీఎస్ రైస్ దందా
-రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న పేదోడి బియ్యం
-సిర్వంచలో ఓ డాన్ అక్రమాలు
-ఎన్ని కేసులు నమోదు అవుతున్నా చర్యలు శూన్యం
-మూడు జిల్లాల సరిహద్దు కేంద్రంగా అక్రమాలు
-అప్పుడప్పుడు టాస్క్‌ఫోర్స్ దాడులతోనే సరి
అక్కడ పెద్ద ఎత్తున కంప్యూటర్లు, ప్రింటర్లు.. వాటితో సీరియస్‌గా పనిచేస్తున్న సిబ్బంది.. ఇదంతా ఏ సాఫ్ట్వేర్ ఆఫీసో లేక ఇంకా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం అనుకుంటే పొరపాటే.. అక్రమ రేషన్ దందాకు సంబంధించిన సెటప్ అదంతా. నిత్యం లక్షల్లో వ్యాపారం… నాలుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బియ్యం సరఫరా.. వీటన్నంటిని మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ మాత్రం సిబ్బంది, కంప్యూటర్ల వ్యవస్థ ఉండాల్సిందే. ఇదంతా కేవలం ఒక వ్యక్తి నడిపిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆశ్చర్యం అనిపిస్తుంది… కానీ, దీని వెనక పెద్ద వ్యవస్థ ఉంది. మూడు జిల్లాల రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు, పోలీసులు కలిసి ఈ దందాకు సహకరిస్తున్నారు. దీంతో ఈ రేషన్ బియ్యం వ్యవహారం అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోంది.
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పలువురు అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి పీడీఎస్ రైస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు మూడు పూటలా అన్నం తినేలా రూపాయికి కిలో చొప్పున బియ్యం అందజేసే ఆహార భద్రత పథకం అభాసుపాలవుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా దందా నడిపిస్తూ రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సివిల్ సప్లై శాఖ పట్టింపులేని తనం.. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వైఫల్యం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులే అసలు దోషులనే విషయం స్పష్టం అవుతోంది.
మంచిర్యాల జిల్లా నుంచి సిర్వంచ దాకా..
అక్రమార్కులు నియమించుకున్న వారు.. డబ్బు ఆశతో దళారులుగా మారిన కొందరు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలోకు రూ. ఏడు నుంచి రూ.ఎనిమిదితో కొనుగోలు చేసి.. ఓ చోట డంప్ చేస్తున్నారు. వారి స్థోమతను బట్టి వివిధ రకాల వాహనాల ద్వారా వీటిని తరలిస్తున్నారు. పెద్దమొత్తంలో పీడీఎస్ రైస్ జమ అయిన తర్వాత లారీ, డీసీఎం వాహనాల్లో అక్రమార్కులు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 11 మధ్యలో గానీ.. తెల్లవారు జాము నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో గానీ మంచిర్యాల ప్రాంతం వారైతే నేరుగా జైపూర్, చెన్నూరు మీదుగా సిర్వంచకు చేరుస్తున్నారు. ఇక బెల్లంపల్లి ప్రాంతం వారు నెన్నల, కోటపల్లి మీదుగా ఈ బియ్యం చేరవేస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల నుంచి సైతం పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున సరిహద్దులు దాటుతోంది.
ఆ డాన్‌పై ఎన్నో కేసులు..
సిర్వంచ కేంద్రంగా జరుగుతున్న ఈ దందా వెనక ఉన్న వ్యక్తిపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. కేవలం మంచిర్యాల జిల్లాలోనే నాలుగు నుంచి ఐదు కేసులు ఉన్నట్లు సమాచారం. మిగతా జిల్లాల్లో సైతం ఇతనిపై కేసులు ఉన్నట్లు సమాచారం. చిన్న చిన్న వ్యక్తులపై పీడీ యాక్టు పెట్టే పోలీసు అధికారులు ఇతని వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాని వెనక మామూళ్ల వ్యవహారం ఉందని గుసగుసలాడుకుంటున్నారు.
సివిల్ సప్లై అధికారుల మౌనం..
ఇక ఈ బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సివిల్ సప్లై అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇందులో జిల్లాలో ఓ సివిల్ సప్లై అధికారికి ప్రతి నెలా రూ. 1.20 లక్షల వరకు ముడుతున్నాయని సమాచారం. ఇక కింది స్థాయి సిబ్బందికి వారి తహతును బట్టి అందుతున్నాయి. దీంతో కనీసం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు స్పష్టం చేస్తున్నారు.
ఆ ఒక్క పోలీసు అధికారి మినహా..
మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ దందా సాగుతుండగా, పోలీసులకు సైతం ఈ పాపంలో వాటాలు ముడుతున్నాయి. ఠాణాను బట్టి పోలీసు అధికారి స్థాయిని బట్టి వారికి డబ్బులు ముట్టచెబుతున్నారు. ఒక్కో ఠాణాకు లక్ష వరకు అందుతున్నాయంటే వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఓ పోలీసు ఉన్నతాధికారి మాత్రం అక్రమ దందా విషయంలో తల దూర్చడం లేదు. ఆయన పుణ్యమా అని అప్పుడప్పుడు బియ్యం అక్రమ రవాణా విషయంలో కేసులు నమోదు అవుతున్నాయి.