త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఆసుపత్రి
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూరులో వీలైనంత త్వరగా ప్రజలకి వంద పడకల ఆసుపత్రి ద్వారా సేవలందిస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రికి సంబంధించి హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే వైద్య శాఖ నుంచి పునరావృత వ్యయం 10.45 కోట్లు (సంవత్సరానికి), పునరావృతం కాని వ్యయం 21.70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని స్పష్టం చేశారు. త్వరలోనే మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే చెన్నూరు పట్టణంతో పాటు చెన్నూర్ మండలం, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలతో పాటు వేమనపల్లి, మహదేవపూర్ (కాళేశ్వరం), సిరోంచ వరకు సుమారు 150 పైగా గ్రామాలకు చెందిన సుమారు రెండు లక్షల మందికి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సకల వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రిని వీలైనంత తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో టీఎస్ఎంఎస్ఐడిసి ఎస్ఈ దేవేందర్ కుమార్, ఈఈ రవీందర్, డిప్యూటీ ఈఈ నర్సింహ రావు, ఏఈ ముబీన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.