68 శాతం వృద్ధితో సింగరేణి బొగ్గు రవాణా
బొగ్గు ఉత్పత్తి లో 60 శాతం, ఓబీ తొలగింపులో 28 శాతం వృద్ధి - ఇకపై రోజుకు రెండు లక్షల ఐదు వేల టన్నుల బొగ్గు రవాణా : ఛైర్మన్ ఎండీ ఎన్.శ్రీధర్ సమీక్ష
సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు తో ముగిసిన ఏడు నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ప్రగతి సాధించింది. గత ఏడాదితో పోల్చితే బొగ్గు రవాణాలో 68 శాతం వృద్ధి, బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం వృద్ధి సాధించింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా సరఫరా చేయగలిగామని సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల తో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం అనంతరం ఈ వివరాలు వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి 218 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేశారు. ఈ ఏడాది తొలి 7 నెలల కాలంలో 68 శాతం వృద్ధి తో 367 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. తద్వారా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా రవాణా చేశామన్నారు. గత ఏడాది తొలి ఏడు నెలల కాలంలో 220 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 60 శాతం వృద్ధి తో 352 లక్షల బొగ్గు ను ఉత్పత్తి చేశామన్నారు. గతేడాది ఇదే కాలానికి సాధించిన 156 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీ పై 28 శాతం వృద్ధి తో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 201 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల కాలంలో కూడా రోజుకు రెండు లక్షల ఐదు వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమతో ఇంధన సరఫరా ఒప్పందం గల అన్ని సంస్థలకు ఎటువంటి కొరత లేకుండా బొగ్గు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రానున్న ఐదు నెలల కాలంలో 330 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తో పాటు అదే పరిమాణంలో బొగ్గును రవాణా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏరియాల వారీగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టడానికి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు.
సమీక్షా సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ల తో మాట్లాడుతూ రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల రీత్యా ప్రతి ఏరియా నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, ఈ ఏడాది సింగరేణి చరిత్ర లోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు జరపాలని, లాభాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి రోజూ 40 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సింగరేణీయులకు దీపావళి శుభాకాంక్షలు…
ఏరియా జీఎంలతో సమీక్షలో సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులకు సీఅండ్ ఎండీ శ్రీధర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల తో ఆనందోత్సాహాలతో, రక్షణతో దీపావళి జరుపుకోవాలన్నారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పర్సనల్,ఫైనాన్స్, పిఅండ్పి) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ, అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, ఈడీ (కోల్మూమెంట్) జె.అల్విన్, జీఎం (కోఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, ఆయా ఏరియాల జీఎం లు మరియు కార్పోరేట్ జి.ఎం.లు పాల్గొన్నారు.