పెద్ద నేతలకు గట్టి దెబ్బ
సొంత ఊరు, అత్తగారి ఊళ్లోనూ గెల్లుకు హ్యాండిచ్చిన ఓటర్లు
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ నేతలకు గట్టి దెబ్బే తాకింది. పెద్ద నేతలకు సైతం తమ ఇలాకాల్లో ఓటర్లు ఆదరించలేదు. టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను సొంత ఊరితో పాటు, అత్తగారి ఊరిలోనూ ప్రజలు పట్టించుకోలేదు. శ్రీనివాస్ యాదవ్ సొంత ఊరు వీణవంక మండలం హిమ్మత్‌నగర్. ఈ గ్రామంలో మొత్తం 1,088 ఓట్లకు 1,005 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారతీయ జనతా పార్టీకి 549, టీఆర్ ఎస్‌కు 358, కాంగ్రెస్‌కు 10 ఓట్లు వచ్చాయి. ఈ ఊళ్లో ఈటలకు 191 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక గెల్లు అత్తగారి ఊరైన హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లె ఓటర్లు కూడా ఆయనను ఆదరించలేదు. ఈ ఊళ్లో ఈటలకు 76 ఓట్ల ఆధిక్యత లభించింది. యాదవ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న వెంకటరావు పల్లెలోనూ ఓటర్లు భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ చూపారు.
మామిడాల పల్లిలో మంత్రి హరీష్‌కు చుక్కెదురు..
మంత్రి హరీష్ రావుకు సైతం ఈ ఎన్నికల్లో చుక్కెదురే అయ్యింది. తాను దత్తత తీసుకుంటానని మంత్రి హరీష్ రావు స్వయంగా హామీ ఇచ్చినా ప్రజలు కనీసం పట్టించుకోలేదు. ఈ ఊళ్లో టీఆర్ ఎస్‌కు ఆధిక్యత ఇస్తే దత్తత తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో హరీష్‌రావు హామీ ఇచ్చారు. ఓటర్లు మాత్రం ఈటెల రాజేందర్‌వైపు మొగ్గు చూపారు. ఈ గ్రామంలో మొత్తం 3,022 ఓట్లకు 2,682 ఓట్లు పోలు అయ్యాయి. ఇందులో బీజేపీ కి 1,190 ఓట్లు, టీఆర్ ఎస్‌కు 1,037 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 48 ఓట్లు వచ్చాయి.
అందరూ నేతలకు అదే రీతిన..
టీఆర్ ఎస్ ప్రముఖ నేతలు అందరిది అదే పరిస్థితి. ప్రముఖ నేతల గ్రామాల్లో ఈటల రాజేందర్ మార్కు హవా కొనసాగింది. కమలం విరబూసింది. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ స్వగ్రామమైన సింగపూర్‌లోనూ ఓటర్లు టీఆర్ ఎస్‌కు షాక్ ఇచ్చారు. వీరి కుటుంబానికి మంచి పట్టున్న తుమ్మనపల్లి, బోర్పల్లిలోనూ బీజేపీ హవా సాగింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుండె రాధిక, వైస్ చైర్ పర్సన్ వార్డుల్లోనూ ప్రజలు ఈటెలకే జై కొట్టారు.