అధికారుల కక్ష.. రైతులకు శిక్ష..
-నెన్నల మండలం గొల్లపల్లిలో కొనుగోలు కేంద్రం ఎత్తివేత
-తూకాల్లో జరిగిన మోసాలు ప్రశ్నించినందుకే కక్షపూరిత చర్యలు
-ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని జిల్లా అధికారులు
-వరి కోసి, కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్న కర్షకులు
-అప్పుల బాధకు తక్కువ ధరకు అమ్ముకుంటున్న సన్నకారు రైతులు
Set up grain procurement centre: రైతులకు అండగా ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారులు వారిపై కక్ష పెంచుకుంటున్నారు. రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు సైతం కనీసం పట్టించుకోకపోవడంతో వారి వైపు కనీసం కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు.
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నల మండలం గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఎత్తివేసిన అధికారులు రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఆరేడు సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రం కొనసాగుతోంది. ఈ మండలంలోనే ఇక్కడ అత్యధికంగా వరి పంట పండిస్తారు. ప్రతి యాసంగి , రబీ లో 100 వరకు లారీల వడ్లు పండుతాయి. అయితే, ఈ ఏడాది కొనుగోలు కేంద్రం పూర్తిగా ఎత్తేశారు.
ఏపీఎం, పీడీ పుణ్యమే..
ఇక్కడ గత ఏడాది యాసంగిలో తూకాల్లో మోసాలు జరిగాయి. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. వాటిని సరి చేయాల్సిన అధికారులు మోత్తానికే కొనుగోలు కేంద్రం ఎత్తేశారు. గత ఏడాది నుంచి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఎత్తేయడానికి ప్రధాన కారణం నెన్నల ఐకేపీ ఏపీఎం విజయలక్ష్మి, డీఆర్‌డీవో పీడీ శేషాద్రి కారణమని రైతులు చెబుతున్నారు.
అత్యధికంగా వడ్లు పండే ప్రాంతం ఇదే…
అధికారులు నెన్నల మండలంలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. అందులో నెన్నల మండల కేంద్రంతో పాటు, గొల్లపల్లి, జెండా వెంకటాపూర్‌లో ఈ కొనుగోలు కేంద్రాలు మూసివేశారు. రెండు చోట్ల వడ్లు తక్కువగా సాగు చేస్తారు కాబట్టి అక్కడ ఎత్తేశారంటే అర్దం ఉంది, కానీ మండలంలో అత్యధికంగా వడ్లు పండే ప్రాంతమైన గొల్లపల్లిలో కొనుగోలు కేంద్రం ఎత్తివేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గొల్లపల్లిలో 536 ఎకరాల్లో 1287 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినట్లు వ్యవసాయ శాఖ లెక్కలే చెబుతున్నాయి.
ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోవడం లేదు..
ఈ విషయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సైతం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో మాట్లాడారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక విసిగివేసారిన రైతులు సోమవారం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాదాపు 15, 20 రోజులుగా కళ్లాల్లో ధాన్యం పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. కొందరు చిన్న, సన్నకారు రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం వరి ధాన్యానికి మద్దతు ధర 2,060 ఉండగా, తప్పనిసరి పరిస్థుతుల్లో 1500 నుంచి 1600కు అమ్ముతున్నారు.
మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటారా..? గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారా..? లేదా..? వేచి చూడాల్సిందే..