కేసీఆర్ కు మూడింది…. వచ్చేది బీజేపీ సర్కారే
-ఈ జనాలను చూసి కేసీఆర్ ఫుల్ బాటిల్ తాగుతడు
-భైంసాను దత్తత తీసుకుంటాం
-ఇక్కడకు రావాలంటే వీసా తీసుకోవాలా..?
-భైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం.. ఉద్యోగాలిస్తాం
-5 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ సాధించేదేమిటి?
-బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ నాణ్యమైన విద్య-వైద్యం ఉచితం
-భైంసా బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
Sanjay Fire on KCR Govt: ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం భైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను కష్టాలకు గురిచేసి కేసీఆర్ ఏం సాధించారని, ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఉద్ఘాటించిన బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భైంసా పేరును మైసాగా మారుస్తామని ప్రకటించారు. భైంసా బాధితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య-వైద్యం అందించడంతో పాటు నిలువనీడ లేని వాళ్లందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. మేం కోర్టును, చట్టాన్ని గౌరవిస్తామని స్పష్టం చేశారు. 3 వేల కుర్చీలేస్తే పోలీసోళ్లు 144 సెక్షన్ పెట్టారని, ఇన్ని వేల మంది వచ్చారని, మీ అందరినీ చూసి మాలో జోష్ పెరుగుతోందని ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు.
భైంసాలో మత కల్లోలాల సందర్బంగా గాయపడ్డ.. కేసుల పాలైనా వెనకడుగు వేయని వారిని అభినందిస్తున్నా అని బండి సంజయ్ అన్నారు. భైంసా బాధితుల పక్షాన హిందూవాహిని తమ్ముళ్ల పోరాటం భేష్ అని కొనియాడారు. భైంసా కు రావాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? ఇక్కడకు రావాలంటే వీసా తీసుకోవాలా? ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు..? అని తీవ్రంగా ప్రశ్నించారు. మతవిద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చు… నా దేవతలను కించపర్చే మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు… దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ వాళ్లు మాత్రం సభలు పెట్టుకోవద్దట… ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ దేశంలో ఉన్నామని? ప్రశ్నించారు.
ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడించాలె అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీ ఏర్పడ్డాక బైంసాను దత్తత తీసుకుంటాం. బైంసా అల్లర్లలో గాయపడ్డ బాధితులపై పెట్టిన కేసులను ఎత్తిపారేస్తాం. వాళ్లకు పక్కా ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. మీ కోసమే కష్టపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు కష్టపడుతున్నామని చెప్పారు. భైంసా ప్రజలారా… భయపడాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం మీ వెంట ఉంది. ఫాల్తుగాళ్లు 12 ఇండ్లు తగలబెడితే… కట్టించామా? లేదా? పీడీ యాక్ట్ పెడితే తొలగించినమా? లేదా? అన్నారు.
కేసీఆర్ కు మూడిందని…. భైంసా అంటేనే కేసీఆర్ కు భయం… ఇక్కడ పెట్టిన సభకు వచ్చిన జన స్పందనను చూసి ఫుల్ బాటిల్ తాగుతడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాల్జేశాడు. 5 లక్షల కోట్ల అప్పుల చేసి ఒక్కో వ్యక్తి పై 1.2 లక్షల అప్పు మోపిండని అన్నారరు. ఒక్క ఉద్యోగమియ్యలే…. మోదీ ప్రభుత్వం పోయిన నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈనెలలో 70 వేల మందికి ఏకకాలంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని తెలిపారు.
లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్…. ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్? రుణమాఫీ చేసినవ్? దళిత బంధు ఇచ్చినవో…? దళిత, గిరిజనులకు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినవ్? చెప్పాలే అని బండి సంజయ్ నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నా చేస్తే పట్టించుకోలేదు కేసీఆర్ అని అన్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని, అన్యాయం జరిగిన వాళ్లకు బీజేపీ అండగా ఉంటుందని అన్నాడు. కడెం ప్రాజెక్టు గేట్ల మేయింటెనెన్స్ కు నిధులు ఇవ్వలేనోడు… రాష్ట్రాన్ని ఏం కాపాడతాడని..? ఆయన ప్రశ్నించాడు.
బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందిరికీ ఉచిత విద్య-వైద్యం అందిస్తామని ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ చీఫ్ హామీ ఇచ్చారు. నిలువనీడలేని పేదోళ్లందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తామని, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు అధికారమిచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ గడ్డపై 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించడం గర్వంగా ఉందని, ప్రస్తుతానికి కష్టాలను భరిద్దాం… రాబోయేది మన ప్రభుత్వమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈ సభలో బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పాదయాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, కుమ్మరి శంకర్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, జిల్లా నేతలు రామారావుపటేల్, బోస్లే మోహన్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.