దేశంలోనే నంబర్ 1

STPP ranked number 1 in the country: జైపూర్ లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల కన్నా అత్యధిక పీఎల్ ఎఫ్ సాధించి నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరుతో ముగిసిన 8 నెలలలో అత్యుత్తమ సగటు పీఎల్ఎఫ్ 90.86 శాతంతో ఈ ఘనత సాధించింది. దీనిపై సంస్థ సీఅండ్ ఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఎస్టీపీపీ ఉద్యోగులు, అధికారులకు తన అభినందనలు తెలిపారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభించి కేవలం 6 సంవత్సరాలు అవుతోంది. మొదటి నుంచీ ఈ ప్లాంట్ తన అత్యుత్తమ పీఎల్ ఎఫ్ తో దేశంలోని 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో అగ్రస్థానాల్లో నిలుస్తూ వస్తోంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమంగా 88.97 శాతం పీఎల్ఎఫ్తో మొదటి స్థానంలో నిలవగా. అదే విభాగంలో 2020-21లో రెండో స్థానంలో నిలిచింది. ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి స్థానంలో ఉండగా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గల ఎన్టీపీసీ కోర్భా సూపర్ పవర్ థర్మల్ స్టేషన్ 90.01 శాతం పీఎల్ ఎఫ్ తో రెండో స్థానంలో, ఎన్టీపీసీకే చెందిన సింగ్రౌలి థర్మల్ పవర్ ప్లాంట్ 89.94 శాతం పీఎల్ఎఫ్ తో మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
నాలుగుసార్లు 100 శాతం
సింగరేణి థర్మల్ ప్లాంట్ ఇప్పటికే నాలుసార్లు 100 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. 2018 సెప్టెంబరు , 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చి నెలల్లో నూటికి పైగా పీఎల్ ఎఫ్ సాధించడం విశేషం. ఈ ప్లాంట్ లో రెండు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్ ఇప్పటి వరకు 10 సార్లు, ఒకటవ యూనిట్ ఏడు సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాటడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి చేయూత
ఇప్పటి వరకు 51,547 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అనుసంధానం చేసి నూతన రాష్ట్ర ప్రగతిలో తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోంది. ఇందులో మరో 800 మెగావాట్ల ప్లాంట్ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని టెండర్ ప్రక్రియను వేగవంతం చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.
సోలార్ లోనూ సింగరేణి ముందంజ…
రాష్ట్రంలో సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటు లో ముందడుగు వేసిన తొలి ప్రభుత్వ సంస్థ సింగరేణి.. ఇప్పటికే 219 మెగావాట్ల ప్లాంట్లను విజయవంతంగా నెలకొల్పింది. మూడో విడత 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు లో భాగంగా త్వరలోనే సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణ లోని నీటి రిజర్వాయర్ లో 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. సింగరేణి థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంతోపాటు సింగరేణి సంస్థ కు లాభాలను చేకూర్చుతుంది.
2026 నాటికి 3 వేల మెగావాట్ల విద్యుత్ : సీ అండ్ఎండీ ఎన్.శ్రీధర్
ఎస్టీపీపీతో పాటు సోలార్ విద్యుత్తో కలిపి మొత్తం 3 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ను అందించేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతోందని సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల తన హర్షం ప్రకటిస్తూ ఇదే పనితీరుతో ముందుకు సాగాలని అధికారులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.