హవ్వ… చెక్కులు చెల్లుతలేవు..
-కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోంది
-ధరణి పోర్టల్ లోపాల పుట్ట
-రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది
-లిక్కర్,క్యాసినో దందాల్లో కేసీఆర్ బిడ్డ వేల కోట్ల పెట్టుబడులు
-బీజేపీ అధికారంలో కొస్తే సంక్షేమ పథకాలన్నీ మెరుగ్గా కొనసాగిస్తాం
Bandi Sanjay’s anger on Kcr:ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. 5వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో నందన్ గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ లోపాల పుట్ట అని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పొరపాట్లతో లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సర్కార్ తీరువల్ల భూమి ఉన్నా రైతు బంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం అందడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే ఆరోపణలను తిప్పికొట్టారు. ‘‘గత పాలకులు ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయబోం. మరింత మెరుగ్గా అమలు చేసి తీరుతా’’మని పునరుద్టాటించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఆ సొమ్మును లిక్కర్, క్యాసినో దందాల్లో పెట్టుబడులు పెట్టారని అన్నారు.
కాలాలకతీతంగా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్న అని ప్రజలకి వెల్లడించారు. ఇప్పుడు ఓట్లు లేవు.. ఎలక్షన్స్ లేవని పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని మోడీ ఆదేశిస్తే… పాదయాత్ర చేస్తున్నా అని బండి స్పష్టం చేశారు. తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం రావాలని చెప్పారు. తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇండ్లను మోడీ మంజూరు చేశారని తెలిపారు. దీనికి సంబంధించి రూ. 4000 కోట్లను విడుదల చేశారని అన్నారు. మహారాష్ట్రలో సంవత్సరం లోపు ఇండ్లను కట్టి, పేదలతో దసరా రోజు గృహప్రవేశం చేయించిన ఘనత మోదీదే అని వెల్లడించారు. కేసీఆర్ కు పేదలకు కట్టించాల్సిన ఇండ్లు ముఖ్యం కాదని… ఆయనకు కావాల్సింది ఓట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకుంటున్నాడని అన్నారు.
ఒక్కరికి కూడా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఊరికి బస్సు లేదు, రోడ్లు లేవు, ఇండ్లు లేవన్నారు. స్కూల్స్ ఉంటే… టీచర్లు ఉండరు. టీచర్స్ ఉంటే… స్కూలు ఉండదు. స్కూల్ బిల్డింగులు అసలే ఉండవని అవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో 70 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడే ఉన్నాడని అన్నారు. 8 ఏళ్లుగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని బండి వెల్లడించారు. తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని తెలిపారు. రైతు రుణమాఫీ చేయలేదని.. 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో… ఎప్పుడు పోతుందో కూడా తెలియదని అన్నారు.
కరెంట్ బిల్లుల మోత మోగిస్తున్నారని, ఇప్పుడు మరోసారి కరెంటు బిల్లులను పెంచేందుకు చూస్తున్నారని తెలిపారు. బస్సు చార్జీలను కూడా పెంచుతారని అన్నారు. కేసీఆర్ 100 రూములతో ఇండ్లు కట్టుకున్నాడు. 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. కోటీశ్వరుడు అవుతున్నాడని… రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దృష్టిలో పేదోడు పేదోడిలానే ఉండాలి. పెద్దోడు ఇంకా పెద్దోడు కావాలని ఉంటుందని అన్నారు. ధరణి పోర్టల్ తో ప్రజల ఉసురు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ధరణిలో పేదల భూములు కనిపించవని, హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగాలను కబ్జా చేసేందుకే ‘ధరణి’ తెచ్చిండని అన్నారు.
బిజెపి ప్రభుత్వం ఏర్పడితే…. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను ఇంకా మంచిగా అమలు చేస్తామని మరోసారి గుర్తు చేశారు.