మనకు పోటీ, సాటి ఎవరూ లేరు..
-నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి కండ్లకు నీళ్లు పెట్టుకున్నం
-ఇప్పుడు కళ్లాల్లో ధాన్యం చూసి ఆనందం అవుతోంది
-ఏ కార్యక్రమం అయినా ప్రజలకు మేలు జరగాలి
-మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్

Chief Minister KCR visited Mahabubnagar: ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో మనకు పోటీ ఎవరూ లేరని, సాటి రారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రావని స్పష్టం చేశారు. నిబద్ధతతో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో పాటు రెండింతల అకింతభావంతో పని చేసిన ప్రభుత్వ అధికారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లా పర్యటించిన సమయంలో నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి నిరంజన్‌రెడ్డి, నేను అంతా కండ్లనీళ్లు పెట్టుకున్నామని అన్నారు. ఆలంపూర్ నుంచి జోగులాంబ వరకు పాదయాత్ర చేస్తే జ్ఞాపకం చేసుకుంటే ఒళ్లు జలదరించే పరిస్థితి అన్నారు. వేదనలు, రోదనలు గుండలవిసేలా బాధలతోని ఇబ్బందులు పడ్డదని పాలమూరు జిల్లా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పంటల కోతలు కోసే హార్వెస్టర్లు, కల్లాల్లో ధాన్యం రాశులు చూసి ఆనందపడ్డానని వెల్లడించారు.
అభివృద్ధే తమ లక్ష్యం అని, ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా అభివృద్ధి చేసి చూపించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 8 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించామన్నారు. టీమ్ వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, ఇందుకు తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన రోజున చీకటి మయం అవుతుందని, తెలంగాణ ఎడారి అవుతుందని ఏవేవో అన్నారని గుర్తు చేశారు. కానీ, ఇవాళ మనం ఏంటో నిరూపించామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.