సింగ‌రేణి సిగ్గుప‌డు..

-సంస్థ‌లో మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న అరాచ‌కాలు
-అధికారులు, అధికార సంఘం దాష్టీకాలు
-బ‌దిలీలు చేసి చేతులు దులుపుకుంటున్న యాజ‌మాన్యం
-ప‌ట్టించుకోని సింగ‌రేణి అధికారులు
-ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటు ప‌ట్ల నిర్ల‌క్ష్యం
-ఏకంగా చ‌ట్టాల‌నే ఉల్లంఘిస్తున్నా ప‌ట్టించుకునే నాథుడే లేడు

Harassment of women workers in Singareni: వేల కోట్ల ట‌ర్నోవ‌ర్‌… వంద‌ల కోట్ల లాభాలు.. వేల సంఖ్య‌లో సిబ్బంది, అధికార‌గ‌ణం… ఓ ఐఏఎస్ అధికారి సార‌థ్యం.. మ‌రో ఐఆర్ఎస్ అధికారితో స‌హా ప‌లువురు డైరెక్ట‌ర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే సింగ‌రేణి సంస్థ గొప్ప‌ద‌నం ఓ పెద్ద పుస్త‌కం అవుతుంది… కానీ.. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే…
————–
ఈ మ‌ధ్య కాలంలో మ‌హిళా ఉద్యోగుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అయితే, అదే స్థాయిలో వారిపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అవి కూడా బ‌య‌ట‌కు తెలిసిన‌వే… తెలియ‌నివి ఇంకా చాలా ఉంటున్నాయి. కార్మిక సంఘాల నేత‌లు, అధికారులు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టంతో యాజ‌మాన్యం సైతం నోరు మెద‌ప‌డం లేదు. విష‌యం బ‌య‌ట‌కు పొక్కి గొడ‌వ‌లు జ‌రిగితే మాత్రం కేవ‌లం బ‌దిలీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

మహిళలు ఎక్కడ పనిచేసిన లైంగిక వేధింపులు తప్పడం లేదు. సమాజంలో స్త్రీ పనిచేయాలంటేనే అవమానాలు ప‌డ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి నెల‌కొంది. సింగరేణి (Singareni) గనులలో పని చేసి ప్రమాదంలో భర్తలను కోల్పోయి ఉద్యోగాలు చేస్తున్న మహిళా కార్మికులను లైంగికంగా కోర్కెలు తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. అధికార సంఘం నేత‌లు కావ‌డంతో బ‌య‌ట‌కు చెప్పాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా, అధికారులకు తెలిపినా తమపై ఎలాంటి దాడులకు పాల్పడుతారో.. పై అధికారులకు చెప్పి బదిలీలు చేయిస్తారేమోననే భయంతో వారు వ‌ణికిపోతున్నారు. తమ‌కు జరిగిన అన్యాయాన్ని ఎక్కడ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతూ ఆవేదన చెందుతున్నారు.

-ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు వేధింపులకు గురిచేశాడు. తరచూ ఫోన్ చేస్తూ.. అసభ్యకర మాట‌ల‌తో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. నిందితుడి వేధింపులు తాళలేని బాధితురాలు తెలివిగా అతడికే ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ చేసింది. ఆధారాలతో సహా ఇల్లందు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

-ఆర్జీ 1 ఏరియా వ‌ర్క్‌షాప్‌లో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ స్వ‌ప్న అనే మ‌హిళా ఉద్యోగిని వేధింపుల‌కు గురి చేశాడు. ఎన్నో రోజులుగా ఈ వ్య‌వ‌హారం సాగుతున్నా ఆ మ‌హిళ భ‌రిస్తూ వెళ్లింది. కానీ స‌హ‌నం కోల్పోయిన ఆమె స్వామిదాస్‌ను తోటి కార్మికుల ఎదురుగానే బూటుతో కొట్టింది. స్వామిదాస్ త‌న అనుచ‌రుడు బండి మ‌హేంద‌ర్ తో ఆమెపై దాడి చేయించాడు. దీంతో గోదావ‌రిఖని వ‌న్ టౌన్ పోలీసు స్టేష‌న్ ఫిర్యాదు చేశారు. విచార‌ణ నేప‌థ్యంలో రాజీప‌డాల‌ని, లేక‌పోతే చంపేస్తామంటున్నార‌ని, సంస్థ‌లో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి సైతం పాల్ప‌డిందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

-మంద‌మ‌ర్రి ఏరియాలో ఓ టీబీజీకేఎస్ నేత కారుణ్య నియామ‌కం కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ యువ‌కుడి భార్య‌పై క‌న్నేశాడు. చివ‌ర‌కు ఆమెను లొంగ‌దీసుకున్నాడు. అనుమానం వ‌చ్చిన యువ‌కుడు ఇంటి వ‌ద్ద సీసీ కెమెరాలు పెట్టించాడు. దీంతో ఆ టీబీజీకేఎస్ నేత‌ బాగోతం ఆ కెమెరాలో చిక్కింది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన టీబీజీకేఎస్ నేత‌లు, టీఆర్ఎస్ నాయ‌కులు ఆ యువ‌కుడికి రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ముట్ట‌జెప్పి విష‌యం స‌ద్దుమ‌ణిగించారు. వారు కూడా రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు మింగేశారు. టీబీజీకేఎస్ నేత‌ను షిఫ్టు మార్పించి చేతులు దులుపుకున్నారు.

-మంద‌మ‌ర్రి ఏరియాలోని రామ‌కృష్ణాపూర్ ఏరియా ఆసుప‌త్రిలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్ర‌ట‌రీ కృష్ణ ఓ న‌ర్సును లైంగికంగా వేధించాడు. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఆ న‌ర్సు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో కృష్ణ‌ను ఇక్క‌డ నుంచి అధికారులు అత‌న్ని బ‌దిలీ చేశారు. అయితే తిరిగి కృష్ణ మ‌ళ్లీ త‌న రాజ‌కీయ ప‌లుకుబ‌డితో తిరిగి రామ‌కృష్ణాపూర్ కు వ‌చ్చేశారు. అయితే ఈ కృష్ణ ఓ టీబీజీకేఎస్ నేత‌కు ప్రియ శిష్యుడు కావ‌డంతో తిరిగి ఆయ‌నకు టీబీజీకేఎస్ ఫిట్ సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

– తాజాగా నాలుగు రోజుల కింద‌ట ఆర్జీ 1 ఏరియా వ‌ర్క్‌షాప్‌లో సైతం మ‌హిళా కార్మికురాలిపై వేధింపుల ప‌ర్వం చోటు చేసుకుంది. ఇక్క‌డ మ‌హిళా బ‌దిలీ వ‌ర్క‌ర్ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఎల‌క్రిక‌ల్ ఫోర్‌మెన్ రాజేశ్వ‌ర్‌రావుపై అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అత‌న్ని కేవ‌లం బ‌దిలీ చేసి వ‌దిలేశారు.

కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలిగా ఉండగా..
సింగ‌రేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు గా కల్వకుంట్ల కవిత కొనసాగుతున్నారు. ఆమె నాయకత్వంలోని ఆ యూనియన్ కు చెందిన నేత‌లు ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళలపై వేధింపులకు గురిచేస్తున్న నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌నిపించినా త‌ర్వాత అటు వైపు దృష్టి సారించ‌డం లేదు. మహిళా ఉద్యోగినులపై టీబీజీకేఎస్ నాయకులు ఎలాంటి వేధింపులు చేయకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని ప‌లువురు కోరుతున్నారు. అదే స‌మ‌యంలో కొంద‌రు మహిళా ఉద్యోగులు క‌విత‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా తిరిగి విర‌మించుకున్న‌ట్లు స‌మాచారం.

సింగ‌రేణి ఏం చేయాలి…? ఏం చేస్తోంది…?
మ‌హిళ‌లు ప‌నిచేసే సంస్థ‌ల్లో వారు లైంగికంగా వేధింపుల‌కు గురి కాకుండా ఆ సంస్థ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. సింగ‌రేణిలో అటు భ‌ర్త‌లు కోల్పోయిన వారితో పాటు, కొత్త‌గా విధుల్లో చేరిన వేలాది మంది మ‌హిళ‌లు ప‌ని చేస్తున్నారు. మ‌హిళ‌ల‌పై వేధింపులు జ‌ర‌గ‌కుండా ముందుగానే చ‌ర్య‌లు తీసుకోవాలి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం, 2013 ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఆ చ‌ట్ట ప్ర‌కారం ఏ సంస్థ అయినా మ‌హిళ‌ల కోసం అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీ ఏర్పాటు చేయాలి. అడ్వ‌కేట్‌, ఎన్‌జీవో, ప‌లువురు స‌భ్యుల‌తో ఈ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ క‌మిటీలో వారికి లైంగికంగా వేధింపుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండాలి.

చ‌ట్టాలు ప‌ట్టించుకోని యాజ‌మాన్యం..
ఈ విధంగా క‌మిటీ ఏర్పాటు చేసి మ‌హిళ‌ల‌కు భ‌రోసా క‌ల్పించాల్సిన సింగ‌రేణి యాజ‌మాన్యం దానిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక‌ర‌కంగా సంస్థ చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోంది. అయినా ప్ర‌జాప్ర‌తినిధులు, కార్మిక సంఘ నేత‌లు దానిపై దృష్టి సారించ‌డం లేదు. కేవ‌లం కార్మికుల ఓట్లు, వారి జేబులు నింపుకోవాలని చూసే కార్మిక సంఘ నేత‌ల‌కు ఇది క‌నిపించ‌డం లేదు. టీబీజీకేఎస్ నేత‌లు స‌రే… మిగ‌తా కార్మిక సంఘ నేత‌లు సైతం ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం మిన‌హా దానిపై నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. మ‌రి ఇప్ప‌టికైనా అటు వైపుగా అడుగులు ప‌డ‌తాయో లేదో వేచి చూడాలి మ‌రి..

Get real time updates directly on you device, subscribe now.

You might also like