ఆ మంత్రి చెరువు కబ్జాల రెడ్డి
-ఆయన భూ దందా అంతా బయటికి తీస్తాం
-మీ అవినీతికి ప్రజలే సాక్ష్యం
-మీ నిర్లక్ష్యం వల్ల ఫారెస్ట్ అధికారి ప్రాణాలు పోయాయి
-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ధ్వజం
MP Soyambapurao slams minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాలో ఎలా భూ కబ్జాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఆదివారం నిర్మల్ లో సభ పెట్టామని, అల్లకల్లోలం అయి ఐకే రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడని ఎద్దేవా చేశారు. చెరువు భూముల విషయంలో హైకోర్టు స్పందించి, ఎందుకు కమిటీని పంపిందని..? సోయం ప్రశ్నించారు. మీ అవినీతి ఏంటో ప్రజలకు తెలుసునని… దానికి ప్రజలే సాక్ష్యమన్నారు. ఆ మంత్రి ఐకే రెడ్డి కాదని చెరువు కబ్జాల (సీకే) రెడ్డని వ్యాఖ్యానించారు.
25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా? అని ప్రశ్నించారు. మీ అవినీతి ని పూర్తిస్థాయిలో బయటికి తీస్తామని ఎంపీ ఈ సందర్భంగా వెల్లడించారు. D1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా మాకు తెలుసునని స్పష్టం చేశారు. అల్లోల అరుణ, శ్రీనివాస్ రెడ్డి అనే పేర్లు ఎవ్వరివో చెప్పాలని ఎంపీ బాపూరావు నిలదీశారు. సోయం బాపురావు గాలిలో గెలిస్తే… మరి నువ్వెలా గెలిచావ్ ఐకే రెడ్డి? అని ప్రశ్నించారు. రైల్వే ప్రాజెక్టులలో 40% వాటా రాష్ట్రప్రభుత్వం ఇస్తే… 60% నిధులను కేంద్రం భరిస్తుంది. ఈ మాత్రం తెలీదా ఐకే రెడ్డి? అంటూ మరోమారు ఎద్దేవా చేశారు.
ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. కొన్ని రూల్స్ ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రూ. 2072 కోట్లతో జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయని, కేంద్రప్రభుత్వం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేదని, పట్టాల పంపిణీకి దిక్కే లేదన్నారు. మీరు పట్టాలు పంపిణీ చేసుంటే… ఓ ఫారెస్ట్ అధికారి ప్రాణాలు పోయేవా..? అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతుందో కూడా మంత్రికి తెలీదన్నారు. విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారని అన్నారు. గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తే దాన్ని ములుగు కు తీసుకెళ్లారని తెలిపారు. ఇప్పటి వరకు చారాణే బయటపెట్టామని ఇంకా ఉందన్నారు. ఐకే రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని ఎంపీ సోయం స్పష్టం చేశారు.