శభాష్ రేవంత్…
పీసీసీ చీఫ్ నిర్ణయంపై రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు - ఆ నిర్ణయంతోనే కేసీఆర్ ఓటమి ఖాయమైందని వెల్లడి - కొందరు నేతలు అనవసరంగా బురద చల్లుతున్నారని ఆగ్రహం
ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నేత అనేది నానుడి. రేవంత్ రెడ్డి అక్షరాలా అదే చేశాడు. హుజూరాబాద్ ఎన్నికల్లో వెనక్కి తగ్గి ఈటెల గెలుపు సుగమమం చేశాడు. దాని ద్వారా ఆయన వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ గెలుపు కోసం బాటలు వేశాడు.
హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక పాత్రను పోషించింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తటష్ట వైఖరి అవలంబించడం ద్వారా ఈటెల రాజేందర్ గెలిచేలా చేయగలిగింది. దీంట్లో ఖచ్చితంగా ప్రధాన పాత్ర పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిదే. హుజూరాబాద్ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్న రీతిలో కొనసాగాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంటే అది ఖచ్చితంగా టీఆర్ ఎస్ గెలుపు కోసం దోహదం చేసేది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి ఈటెల ఓడిపోయేవారు. దీనిని గమనించే రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
ఈటెల, రేవంత్ భేటీ…
ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి సమావేశం అయ్యి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దీనికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వం వహించారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి కూడా చేసింది. అవును తాము కలిసిన మాట వాస్తవమే అని వారు సైతం అంగీకరించారు. ఈ సమావేశంలోనే కేసీఆర్‌ను ఎలా ఓడించాలి..? ఏం చేయాలి అనే దానిపై పూర్తి స్థాయిలో వ్యూహరచన చేశారు. కేసీఆర్‌ను ఎలాగైన ఓడించాలనే పట్టుదలతో ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డి వీరిద్దరు కూర్చుని మాట్లాడుకోవడంలో సఫలీకృతమయ్యారు. అక్కడే టీఆర్ ఎస్ పార్టీకి మొదటి ఓటమి ఖాయమయ్యింది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనక్కి…
మొదట రెండు, మూడు రోజులు ఉత్సాహంగా ముందుకు కదిలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ తర్వాత వెనక్కి తగ్గాయి. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సైతం ఈటెలకు మద్దతు చెప్పేందుకు పరోక్షంగా సంకేతాలు అందాయి. నేరుగా కేసీఆర్‌ను ఢీకొట్టలేమని శత్రువుకు శత్రువు ఈటెల రాజేందర్ మనకు మిత్రుడు అనే విషయాన్ని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పగలిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆయన గెలుపు మరింత సులవయ్యింది.
అర్దం చేసుకోని సీనియర్లు..
రేవంత్ రెడ్డి అవలంబించిన ఈ వ్యూహం సీనియర్ నేతలకు అర్దం కావడం లేదు. కొందరికీ అర్దం అయినా పీసీసీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 34 శాతం ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌కు.. ఈ ఎన్నికల్లో మూడువేల ఓట్లే రావడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఓటమికి గల కారణాలను అధిష్టానానికి నివేదిస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు హుజురాబాద్ ఎన్నిక ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందని, ఓటమికి మొత్తం బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ వారు అర్దం చేసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో గెలుపునకు నాంది..
వాస్తవానికి ఈ ఎన్నిక ద్వారా రేవంత్‌రెడ్డి చాలా సాధించారు. తన శత్రువు కేసీఆర్ ఓటమి పాలయ్యేలా చేయడం. గెల్లు ఓటమి ద్వారా అది సాధించగలిగారు. ఇక మొత్తం కేసీఆర్ ప్రభ తగ్గిపోయిందని ఇక టీఆర్ ఎస్‌ను ఓడించడం అసాధ్యం ఏమి కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అని శ్రేణులకు చెప్పగలిగారు. ఇలా ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి తాను అనుకున్నది చేయగలిగారు. మరి అధిష్టానం ఆయనను అర్దం చేసుకుంటుందా..? లేదా..? చూడాల్సి ఉంది.