సింగరేణిలో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణం

-రూ.354 కోట్లతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి
-దశల వారీగా నూతన క్వార్టర్లు నిర్మిస్తున్న సింగరేణి
-2018 నుంచి ఇప్పటి వరకు 1853 కొత్త క్వార్టర్ల నిర్మాణం
-సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటన

Construction of 643 new quarters in Singareni: సింగరేణిలో రెండో దశ 643 కొత్త క్వార్టర్లను నిర్మించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించారు. మరో 18 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్ లో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సింగరేణి వ్యాప్తంగా పాత క్వార్టర్ల స్థానంలో కొత్త క్వార్టర్లను సింగరేణి ఇచ్చేలా సంస్థ నిర్మించి ఇస్తుందని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే సింగరేణి సంస్థ భూపాలపల్లి, కొత్త గూడెం, ఆర్జీ-3 ఏరియా, సత్తుపల్లి ప్రాంతాల్లో 1853 క్వార్టర్లను నిర్మించింది. రెండో దశలో ఇప్పుడు మరో 643 క్వార్టర్లను రూ. 354 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.

సింగరేణిలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఇప్పటికే 49,919 క్వార్టర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కొత్తగా గనులు విస్తరిస్తున్న ప్రాంతాల్లోనూ, కాలం చెల్లిన క్వార్టర్ల స్థానంలో ఆధునిక డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కార్పోరేట్ ఏరియాలో (కొత్తగూడెం) 209, కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రాంతంలో 353, సత్తుపల్లి ప్రాంతంలో 81 క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

సింగరేణి కంపెనీ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను అమలు జరుపుతోందని సంస్థ ఛైర్మన్ శ్రీధర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు కార్మికులకు ఉచిత కరెంట్, సొంతింటి నిర్మాణానికి 10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు, కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, కార్మికుల పిల్లల ఉన్నత చదువులకు ఫీజు రీయెంబర్స్మెంట్, లాభాల్లో వాటా వంటి అనేక పథకాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు 2013-14లో ఒక్కొక్క కార్మికుడి సంక్షేమానికి సగటున రూ.90 వేల చొప్పున వెచ్చించగా స్వరాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఇది క్రమంగా పెరుగుతూ 2020-21లో 2లక్షలు, 2021-22లో దాదాపు 3.10లక్షలకు పెరిగిందన్నారు. ముఖ్యంగా కార్మికుల వైద్యం కోసం సగటు రూ.300 కోట్లు వెచ్చిస్తోందన్నారు. కరోనా పరిస్థితులు ఎదుర్కోవడానికి దేశంలో ఏ ఇతర పరిశ్రమ చేపట్టని విధంగా సుమారు రూ.74 కోట్లతో ముందస్తు వైద్య సేవలు, వ్యాక్సినేషన్ చేపట్టామని, 5 చోట్ల సొంత ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విధంగా సింగరేణి ఏ ఇతర ప్రభుత్వ సంస్థలతో పోల్చినా సరే సంక్షేమంలో నెంబరు-1గా నిలుస్తోందని పేర్కొన్నారు.

సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాలు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి చరిత్రలో అత్యధికంగా ఈ యేడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశగా ఉద్యోగులందరూ కృషి చేయాలని, తద్వారా చరిత్రలోనే అత్యధిక లాభాలు, సంక్షేమం అందుకోవచ్చన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like