చిన్నారి దండు… పర్యావరణ స్పృహ మెండు..
Went for a picnic.. Protected the environment: ఆ విద్యార్థులు పిక్నిక్ వెళ్లారు.. ఆడుతూ, పాడుతూ గడిపారు.. అయితే అక్కడ ఉన్న చెత్తాచెదారం ముఖ్యంగా ప్లాస్టిక్ చూడగానే బాధ అనిపించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. విద్యార్థులంతా కలిసి తలా ఓ చేయి వేసి ఆ పుణ్యక్షేత్రంలో వ్యర్థాలు లేకుండా శుభ్రం చేశారు.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం విద్యాభారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు కొమురంభీమ్ జిల్లాలోని గంగాపూర్ కు పిక్నిక్ వెళ్లారు. అక్కడ విద్యార్థినీ, విద్యార్థులు ఆడుకుంటుండగా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి బాధ అనిపించింది. వెంటనే ఆ పాఠశాల నిర్వాహకులు శరత్ సైతం విద్యార్థులతో మాట్లాడి అంతా కలిసి అక్కడ మొత్తం శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం తొలగించి చెత్త అంతా కాలబెట్టారు.
ఈ సందర్భంగా విద్యాభారతి పాఠశాల నిర్వహకులు శరత్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ పట్ల స్పృహ కలిగించాలన్నదే తమ అభిమతమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్‌లో వారు మరింత బాధ్యతగా మెలుగుతారని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇలాంటి నిర్ణయం తీసుకుని గంగాపూర్ క్షేత్రాన్ని పరిశుభ్రం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.