బొగ్గు పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారు
సింగరేణి రక్షణకు సమ్మెకు సిద్ధంగా ఉండాలి
ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సింగరేణి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎండి మునీర్ అధ్యక్షతన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి లేకుండా చేయడానికి కార్యాచరణ రూపొందించిందని మండిపడ్డారు. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను కూడా స్థాపించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు సింగరేణి పరిశ్రమ విస్తరణతో ముడిపడి ఉందని నాయకులు పేర్కొన్నారు. బొగ్గు డిమాండ్ మేరకు ఉత్పత్తి సాధించడంలో వెనుకబడినందున ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ఎలాంటి అనుభవం లేని కంపెనీలకు బొగ్గు బ్లాకులను కేటాయించడం అన్యాయం అన్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మోడీ మిత్రుడు ఆదానికి లాభం చేకూర్చడానికే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. బొగ్గు బ్లాక్ లను వేలం పాటలో దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వమే ఆర్థికంగా సహాయం చేయడం,సీఐఎల్, సింగరేణి పరిశ్రమలకు కఠిన నిబంధనలు విధించడం దుర్మార్గం అన్నారు. లాభాలు సాధిస్తున్న కోల్ ఇండియా సింగరేణి సంస్థలకు కొత్త గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా దేశంలోని బొగ్గు పరిశ్రమను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని పేర్కొన్నారు. నూతన ఎం ఎం డి ఆర్ చట్ట ప్రకారం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సింగరేణి సంస్థకే ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికిని మోడీ సర్కార్ మోసం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు కొత్త బ్లాక్ ల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, సింగరేణిలో ఔట్సోర్సింగ్ చేపట్టరాదని, కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగుల మాదిరి జీతాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి రక్షణకు సమ్మెకు సిద్ధపడాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు ఒకటవ కేటగిరి వేతనాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశం లో సింగరేణి గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు టి. శ్రీనివాస్, ఏఐఎఫ్ టియు నాయకుడు జి. రాములు, ఐఎఫ్టియు (చంద్రన్న) నాయకుడు ఈ.రాజేందర్, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు గట్టయ్య, అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామమూర్తి, పర్లపెల్లి రవి, జె వి రాజు, కార్పొరేటర్ ఇంజపూరి పులెందర్, కార్మిక సంఘాల నాయకులు వైవి రావు పి. ధర్మపురి, మాదాసి రవీందర్, ఐ. కృష్ణ, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు.