పులుల దాడిలో ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘటన
Two killed in tiger attack: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఒకరోజు ఇద్దరూ వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో పులి దాడిలో మృతి చెందిన సంఘటన సంచలనం సృష్టించింది.
సావళి తాలూకా రుద్ర పూర్ గ్రామనికి చెందిన బాబురావు బుద్ధజి కంబ్లే (65)అనే వ్యక్తి తెల్లవారుజామున మలవిసర్జనకు వెళ్లాడు. అటవీ ప్రాంతం వైపు వెళ్లగా ఆకస్మికంగా పులి దాడి చేయడంతో మృతి చెందాడు. మూల్ తాలూకా కంటపెట్ వద్ద పశువులు మేపేందుకు అటవి ప్రాంతంలో వెళ్లిన లహాను సోపాంకర్ (54) సైతం పులి దాడి చేసి చంపేసింది.
మహారాష్ట్రలో పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటు పశువులతో పాటు మనుషులపై దాడి చేసి చంపేస్తున్నాయి. రాష్ట్రంలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల అటవీ ప్రాంతంలో తాడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఉంది. పులుల ఆవాసానికి అది అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో పలు అటవీ గ్రామాల్లో ప్రజలపై పులులు దాడు చేస్తున్నాయి.
మరోవైపు తాడోబా నుంచి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి సైతం పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా అటవీ గ్రామాల్లో ప్రజలు, పశువులపై ఈ పులుల దాడి కొనసాగుతోంది. ముఖ్యంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిలో ఈ మధ్య కాలంలోనే నలుగురు వ్యక్తులు మరణించారు. పశువులపై కూడా పెద్ద ఎత్తున దాడి చేశాయి.