ఆరోగ్య తెలంగాణ లక్ష్యం

-మహిళాభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నాం
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెల్లడి

Balka Suman launched the KCR Nutrition Kit scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. బుధవారం “కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీల్లో రక్తహీనత తగ్గించడంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచననే ఈ పౌష్టికాహార కిట్‌ అని వెల్లడించారు. తమ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంతో పాటు మహిళ సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నామన్నారు.

ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. తొలి విడతలో భాగంలో మంచిర్యాల జిల్లాలోని 22 PHC సెంటర్ల పరిధిలోని 4014 మంది గర్భిణులకు కిట్ల పంపిణీ చేస్తామన్నారు. కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేసిందనీ వెల్లడించారు. కేసీఆర్ కిట్ పుట్టిన బిడ్డ కోసం అయితే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పుట్టబోయే బిడ్డ కోసమన్నారు.

అత్యధికంగా ఎనీమియా (రక్తహీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాల్లో ఉన్న 1.25లక్షల మంది గ‌ర్బిణుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుందని స్పష్టం చేశారు. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనీ సుమన్ వెల్లడించారు.

ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యమన్నారు. ఒక్కో కిట్‌కు రూ.1962 కాగా, దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదనీ తెలిపారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇస్తమన్నారు.

ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయనీ అయన తెలిపారు. ఇప్పటి వరకు 13,90,634 మంది ల‌బ్ధిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కేసీఆర్‌ కిట్‌ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందనీ అయన గుర్తు చేశారు.

ప్రభుత్వ దవాఖానాల్లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 30శాతంగా ఉన్న ప్రసవాలు ఇప్పుడు 66 శాతానికి చేరాయనీ చెప్పారు. ప్రతి ఆడబిడ్డ తెలంగాణ బిడ్డ అనుకుని.. ప్రతి సంవత్సరం 37 వేల మంది ఇతర రాష్ట్రాల మహిళలకు సైతం ప్రసవాలు చేస్తున్నామని బాల్క ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్ వారు ఎక్కువగా ఉన్నారనీ చెప్పారు. రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల ప్రసవాలు జరుగుతుండగా, ఇందులో 62% ప్రభుత్వ దవాఖానాలోనే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక బిడ్డ పుడితే 12 వేలు .. ఆడబిడ్డకు 13 వేలు ఇస్తున్న ఏకైక సర్కార్ బిఆర్ఎస్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మాత శిశు కేంద్రాలు ప్రారంభం అయినట్లు తెలిపారు. 672 ప్రసూతి కేంద్రాల అభివృద్ధి చేశామని వెల్లడించారు.

మహిళల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసిన బాల్క సుమన్ ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, షీ టీమ్స్ పథకాలు మహిళల కోసం తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ , శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like